న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రైతుల గురించి మోదీ ఏ మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రైతుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మోదీ.. సూట్ బూట్ వేసుకున్న వారితో మాత్రం చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారని మండిపడ్డారు. ఇదంతా చూస్తుంటే స్వాతంత్ర్యానికి ముందు కొందరు భారతీయులే బ్రిటిషర్లకు మద్దతిచ్చేవారని, ఇప్పుడు ప్రధాన మంత్రే స్వయంగా సూట్ బూట్ గ్యాంగ్‌తో చేతులు కలిపి రైతులను అన్యాయం చేస్తున్నారని రాహుల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ‘ప్రస్తుతం దేశం చంపారన్ ఉద్యమాన్ని తలపిస్తోంది. అప్పట్లో కొందరు ఆంగ్లేయులకు మద్దతిచ్చారు. ఇప్పుడు ప్రధాని మోదీ కూడా అలాంటి వారికే మద్దతిస్తున్నారు. కానీ ఉద్యమంలో పాల్గొన్న ప్రతీ రైతూ ఓ సత్యాగ్రాహి అన్న విషయం గుర్తెరగాలి’’ అని రాహుల్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే కేంద్రం తాజాగా తెచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో వేలమంది రైతులు ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే. రైతు చట్టాల వల్ల రైతులు నష్టపోతారని, కార్పొరేటర్లకు దోచి పెట్టేందుకు మోదీ ఈ చట్టాలను తెచ్చిపెట్టారని నిప్పులు చెరుగుతున్నారు. ఈ నేపథ్యంలోనే నేడు(ఆదివారం) వారు ఓ ప్రకటన విడుదల చేశారు. జనవరి 13న వ్యవసాయ చట్టాల ప్రతుల్ని తగలబెట్టి లోహ్రి పండగ చేసుకుంటామని ప్రకటించారు.  కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లను పెడ చెవిన పెడుతోందని, దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు.

అంతే కాకుండా స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినమైన జనవరి 23న రైతు దినోత్సవం(కిసాన్ దివస్)గా జరుపుకుంటామని రైతులు తెలిపారు. డిసెంబర్ 30న రైతులకు కేంద్ర ప్రభుత్వానికి మధ్య జరిగిన ఆరవ విడత చర్చల్లో సగానికి పైగా అంశాల్లో ఏకాభిప్రాయం కుదిరిందని కేంద్రం ప్రకటించింది.అయితే ఈ విషయాన్ని రైతులు కొట్టిపారేశారు. ఇదంతా అసత్య ప్రచారమని ఆగ్రహం వ్యక్తం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: