కరోనా మహమ్మరి మరింతగా వ్యాప్తి చెందకుండా ఇప్పటికే పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటోంది ఏపీ ప్రభుత్వం. చాలావరకు వైరస్ వ్యాప్తిని అరికట్టగలిగింది. మరోవైపు వ్యాక్సిన్ పంపిణీ విషయంలోనూ కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ డ్రై రన్ కంప్లీట్ చేశారు. కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే.. వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించేందుకు అన్ని రకాలుగా సిద్దమవుతోంది ప్రభుత్వ యంత్రాంగం. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ కమిటీ వివిధ సందర్భాల్లో భేటీ అయింది. ఈ క్రమంలో రాష్ట్రంలో తొలి విడతలో ఎంత మందికి వ్యాక్సిన్ ఇవ్వాలి.. ఏయే వర్గాల వారికీ వ్యాక్సిన్ ఇవ్వాలి.. దానికి సంబంధించిన వివరాలు నమోదు ఏ విధంగా చేయాలనే అంశాలపై ఎప్పటికిప్పుడు అప్డేట్ అవుతూనే ఉన్నారు ఏపీ అధికారులు. అలాగే వ్యాక్సిన్ పంపిణీకి అవసరమైన అంచనాలను సిద్దం చేస్తున్నారు అధికారులు.
తొలివిడత కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కోసం 3లక్షల 70వేల మంది వైద్యారోగ్య సిబ్బందితో పాటు ఫ్రంట్‌లైన్ వర్కర్లు మొత్తం 9 లక్షల మందికి సంబంధించిన జాబితాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ మేరకు ఆయా శాఖలకు చెందిన ఉద్యోగులతో డేటాబేస్ కూడా సిద్దం చేసింది ప్రభుత్వం. ఇదే సందర్భంలో ఫ్రంట్ లైన్ వర్కర్లు ఏయే శాఖల్లో ఉన్నారో.. ఆ శాఖలకు విడివిడిగా నోడల్ అధికారులను సిద్ధం చేసుకోనుంది. వీరితో పాటు 50 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న 90 లక్షల మందికి కూడా వాక్సిన్ వేసేందుకు జాబితాలను సిద్ధంచేస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి