వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతాను తొలగించడం ఇప్పుడు పెద్ద దుమారానికి తెర తీస్తోంది. ట్రంప్ ట్విట్టర్ అకౌంట్‌ను శాశ్వతంగా తొలగిస్తూ ఇటీవల ఈ మైక్రో బ్లాగింగ్ సైట్ తీసుకున్న నిర్ణయంపై అమెరికాలో ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ పరిణామాలపై భారతీయ అమెరికన్ నిక్కీహేలీ సహా రిపబ్లికన్లు చాలా మంది మండి పడుతున్నారు. ట్విట్టర్ చర్యను తీవ్రంగా పరిగణించిన నిక్కీ.. ‘ఇది అమెరికా.. చైనా కాదు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ గెలుపును నిర్ధారించేందుకు ఇటీవల కాంగ్రెస్ సభ్యులు కేపిటల్ భవనంలో సమావేశం అయిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ మద్దతుదారులు.. ఈ భవనంలోకి చొచ్చుకొని వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో ఇక్కడ పెద్ద ఘర్షణ జరిగి, అది కాస్తా హింసాత్మకంగా మారింది. ట్రంప్ మద్దతు దారులను అడ్డుకునేందుకు పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది. ఆ సమయంలో జరిగిన కాల్పుల్లో ఓ పోలీసు అధికారితోపాటు నలుగురు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటనపై ట్రంప్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. అయితే, ఆయన ట్వీట్ల కారణంగా దేశంలో హింస మరింత చెలరేగే అవకాశం ఉందని ట్విట్టర్ ఆరోపించింది. ఈ కారణంగా ట్రంప్ ట్విట్టర్ ఖాతాను శాశ్వతంగా నిషేధిస్తున్నట్టు ప్రకటించింది.

ఇలా దేశ అధ్యక్షుడి ఖాతాను శాశ్వతంగా నిషేధించడంపై నిక్కేహేలీ ట్విట్టర్‌లోనే తీవ్రంగా ధ్వజమెత్తారు. ‘‘ప్రజలను నోరెత్తకుండా చేయడం చైనాలోనే జరుగుతుంది. మన దేశంలో కాదు. అసలు ఇది నమ్మలేకుండా ఉన్నా’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అమెరికా పట్టణ అభివృద్ధి, హౌసింగ్ శాఖ కార్యదర్శి డాక్టర్ బెన్ కార్సన్ కూడా హేలీతో గొంతు కలిపారు. ‘‘దేశాన్ని ఏకం చేసేందుకు కొంతమంది ఓటర్ల నోళ్లు మూయించడం, చరిత్రను చెరిపేయడం అనేది సరైన మార్గం కాదు. ఇది మరింత విభజనకు దారితీస్తుంది. టెక్నాలజీ, సోషల్ మీడియా దిగ్గజాలు మీడియా సంస్థల్లా పనిచేయాలని కోరుకుంటాయి. కానీ, బాధ్యత వహించడానికి మాత్రం ఇష్టపడవు. మీరు ఔనన్నా, కాదన్నా వాక్కు స్వేచ్ఛగానే ఉండాలి’’ అని కార్సన్ ట్వీట్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: