స్థానిక ఎన్నిక‌ల విష‌యంలో ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడి మాదిరిగా ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై జ‌గ‌న్ ప్ర‌భుత్వం గుంభ‌నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నా.. లోలోన మాత్రం మ‌థ‌న ప‌డుతోంద‌ని అంటున్నారు వైసీపీ సీనియ‌ర్ నాయ‌కులు. అంత‌ర్గ‌త సంభాష‌ణ‌ల్లో ఎన్నిక‌ల తీరుపై చ‌ర్చించుకుంటున్నారు. స్థానిక ఎన్నిక‌ల షెడ్యూల్ను స‌వాలు చేస్తూ.. రాష్ట్ర ప్ర‌భుత్వం హైకోర్టుకు వెళ్లిన నేప‌థ్యంలో షెడ్యూల్ను స‌స్పెండ్ చేస్తూ.. సింగిల్ జ‌డ్జి ధ‌ర్మాస‌నం తీర్పు చెప్పింది. దీంతో వెనువెంట‌నే.. నిమ్మ‌గ‌డ్డ దీనిని మ‌ళ్లీ హైకోర్టులో డివిజ‌న్ బెంచ్‌లో స‌వాలు చేశారు.

ఈ క్ర‌మంలో నిమ్మ‌గ‌డ్డ త‌ర‌ఫున న్యాయ‌వాది చేసిన వాద‌న‌లు.. ప్ర‌భుత్వంలో తీవ్ర చ‌ర్చ‌కు దారితీశాయి. ప్ర‌స్తుతం ఒకింత ఉప‌శ‌మ‌నం ల‌భించిన‌ట్టు క‌నిపిస్తున్నా.. అంటే.. ఈ నెల 18 వ‌ర‌కు స‌స్పెండ్ ఉత్త‌ర్వులు అమ‌ల్లోనేఉన్నా.. 18వ తారీకు ఏం జ‌రుగుతుంద‌నే విష‌యంలో వైసీపీ తీవ్ర‌స్థాయిలో త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతోంది. ఎందుకంటే.. ఒక‌సారి షెడ్యూల్ ఇచ్చిన త‌ర్వాత నిలిపి వేసిన చ‌రిత్ర దేశంలోనే లేద‌ని ఎన్నిక‌ల సంఘం లేవ‌నెత్త‌డం.. ప్ర‌భుత్వాన్ని ఇరుకున ప‌డేస్తోంది. ఈ వాద‌న‌కు బ‌లం చేకూర్చేలా.. ఇత‌ర రాష్ట్రాల్లో ఎన్నిక‌ల విష‌యాన్ని కూడా నిమ్మ‌గ‌డ్డ త‌ర‌ఫున న్యాయ‌వాది కోర్టుకు విన్న‌వించారు.

దీంతో రేపు 18వ తారీకునాటి విచార‌ణ‌లో .. నిమ్మ‌గ‌డ్డ వాద‌న‌ల‌కు క‌నుక హైకోర్టు అనుకూలంగా తీర్పు చెబితే.. ఏపీ స‌ర్కారు వెనువెంట‌నే సుప్రీంకోర్టును ఆశ్ర‌యించ‌నుంది. అయితే.. ఇప్పుడు నిమ్మ‌గ‌డ్డ ఏ విష‌యం అయితే.. చెబుతున్నారో.. అంటే.. షెడ్యూల్ ఇచ్చిన త‌ర్వాత ఎన్నిక‌ల‌ను వాయిదా వేసిన చ‌రిత్ర‌లేద‌నే అంశంలో సుప్రీం కోర్టు కూడా గ‌తంలో ఏకీభ‌వించింది. సో.. ఇప్పుడు హైకోర్టులో క‌నుక ప్ర‌భుత్వ వాద‌న‌కు ఎదురు దెబ్బ‌త‌గిలితే.. సుప్రీంలో సానుకూల తీర్పు వ‌చ్చే అవ‌కాశం లేద‌న్న‌ది వైసీపీ సీనియ‌ర్ల అంత‌ర్మ‌థ‌నం.

దీంతో నిమ్మ‌గ‌డ్ద లేవ‌నెత్తిన ఈ వాద‌న విష‌యంలో స‌ర్కారు తీవ్ర‌స్థాయిలో మ‌ద‌‌న ప‌డుతోంద‌ని.. దీనిని అధిగ‌మించేందుకు సుప్రీం కోర్టు సీనియ‌ర్ లాయ‌ర్ల‌తో చ‌ర్చించేందుకు ఇప్ప‌టికే విజ‌యసాయిరెడ్డి బృందం ఢిల్లీకి కూడా వెళ్లింద‌ని చెబుతున్నారు. మ‌రి జ‌గ‌న్‌కు షాక్ త‌గులుతుందా?  నిమ్మ‌గ‌డ్డే వెన‌క్కి త‌గ్గే ప‌రిస్థితి వ‌స్తుందా?  చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: