క‌ర్నూలు జిల్లా నంద్యాల మునిసిపాలిటీలో టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ మ‌ధ్య ఆస‌క్తిపోరు సాగుతోంది. ఇక్క‌డ నుంచి టీడీపీ గెలిచి.. చంద్ర‌బాబుకు కానుక‌గా ఇవ్వాల‌ని మాజీ ఎమ్మెల్యే భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇక‌, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా ర‌వి.. త‌న స‌తీమ‌ణి నాగిణిని గెలిపించుకుని మునిసిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ చేయించుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. దీంతో ఇక్కడ పోరు ఇరు పార్టీల‌కు ప్ర‌తిష్టాత్మ‌కంగా మారింది. 130 ఏళ్ల‌కు పైగా చరిత్రను సొంతం చేసుకున్న నంద్యాల మున్సిపాలిటీకి రాష్ట్రంలో ప్రత్యేక స్దానం ఉంది. స్పెషల్ గ్రేట్  మున్సిపాలిటీగా కొనసాగుతున్న‌ నంద్యాల మున్సిపాలిటీ నుంచి ఎన్నికైన నాయకులు రాష్ట్ర స్దాయి నేత‌లుగా ఎదిగి ఎన్నో పదవులు సైతం పొందారు.

మునిసిపాలిటీ ప‌రిదిలో 42 వార్డులు ఉన్నాయి. నంద్యాల మున్సిపాలిటీ  నుంచి కౌన్సిలర్ గా ఎన్నికైన టీడీపీ నేత‌ ఎన్.ఎం.డి ఫరూఖ్  నంద్యాల పట్టణ అభివృద్ధిలో భాగంగా పట్టణంలో త‌నదైన మార్కు చూపించారు.  దివంగ‌త ఎంపీ ఎస్పీవై రెడ్డి తొలుత నంద్యాల‌ మున్సిపల్ ‌కౌన్సిలర్ ఎన్నిక‌య్యారు. తర్వాత ఛైర్మన్ గా కొనసాగారు. ప్రస్తుత ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష ‌పార్టీల నాయకులు 42 వార్డుల్లో గెలుపు పై ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. ప్రస్తుతం నంద్యాల ఎమ్మెల్యే ఉన్న  శిల్పా ‌రవి 42 వార్డుల్లోనూ గెలుపుపై ధీమాతో ఉన్నారు. ఎమ్మెల్యే శిల్పారవి స‌తీమ‌ణి నాగిణి రెడ్డిని ఛైర్మన్ అభ్యర్దిగా ప్ర‌క‌టించారు.

అదే స‌మ‌యంలో టీడీపీ కూడా అన్నివార్డుల్లోనూ గెలిచి తీరుతామ‌ని చెబుతోంది. ఆ దిశ‌గా మాజీ ఎమ్మెల్యే  భూమా బ్రహ్మానందరెడ్డి కృషి చేస్తున్నారు. ఇక‌,  సుదీర్ఘ కాలంగా ఇక్క‌డి ప్రజలు ఎదుర్కొంటున్న వరద నివారణ, ప‌ట్ట‌ణంలోని కుందూ, చామకాల్వ, మద్దిలేరు వాగులపై నూతన బ్రిడ్జ్ నిర్మాణంతో పాటు వెడల్పు చేసి పట్టణం వరద ముంపుకు గురికాకుండా అన్ని రకాల చర్యలు చేపడతామ‌ని హామీలు ఇస్తున్నారు. కుందూనదిపై మధ్య‌లో ఆగిపోయిన నూతన బ్రిడ్జ్ నిర్మాణం వెంటనే చేపడ‌తామ‌ని చెబుతున్నారు. ఇక‌, ఓట‌ర్ల విష‌యానికి వ‌స్తే.. త‌మ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేవారికే ప్రాధాన్యం ఇస్తామ‌ని.. వారికే ఓటు వేస్తామ‌ని చెబుతున్నారు. మ‌రి నంద్యాల మునిసిపాలిటీలో ఎవరు గెలుస్తారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: