గత ఎన్నికల్లో సీపీఎం నేతృత్వంలో ఎల్డీఎఫ్‌ ప్రభుత్వం 91 సీట్లు గెలుచుకుని.. కేరళలో అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలోని యూడీఎఫ్‌ 47 స్థానాలతో సరిపెట్టుకోగా... బీజేపీ కేవలం ఒకే ఒక్క స్థానంలో గెలుపొందింది. అయితే, ఈసారి ఎలాగైనా సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతోంది బీజేపీ. అయితే, అధికార ఎల్డీఎఫ్‌ కూడా అంతే స్థాయిలో ధీమాగా ఉంది. ఇటీవల గోల్డ్‌ స్కామ్‌లో సీఎం పినరయి విజయన్‌పై ఆరోపణలు రావడం... అధికార పార్టీని కాస్త ఇబ్బంది పెట్టినా ఎన్నికల్లో పెద్ద ప్రభావం చూపబోదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. శబరిమల ఇష్యూ సైతం.. అగ్గి రాజేసినా... అది ఎంతవరకు ఓటర్లను ప్రభావితం చేస్తుందో చెప్పలేని పరిస్థితి. సీఎం పినరయి పెద్దగా తాయిళాలేం ప్రకటించకపోయినా... ప్రజాకర్షణ చెక్కు చెదరలేదని తెలుస్తోంది. కేరళలో పూర్వవైభవానికి కాంగ్రెస్‌ పార్టీ కృషి చేస్తోంది. అయితే, క్యాడర్‌ను నమ్ముకున్న భాజపా సైతం తనవంతు కృషి చేస్తోంది. ఇటీవల స్థానిక ఎన్నికల్లో గెలుపు ఇచ్చిన ధైర్యంతో ఎల్డీఎఫ్‌ ధీమాతో ఉంది.


అటు, తాజాగా కాంగ్రెస్‌ సర్కార్‌ కుప్పకూలిన పుదుచ్చేరిలో... ఈసారి జెండా ఎగరేయాలని బీజేపీ కసిగా ఉంది. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో 30 స్థానాలకు గానూ కాంగ్రెస్‌, డీఎంకే కలిసి 17 స్థానాలతో గెలుపొంది గతంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే, ఇటీవల ఏర్పడిన సంక్షోభంలో.. కాంగ్రెస్‌ సర్కార్‌ గద్దె దిగక తప్పలేదు. నామినేటెడ్‌ ఎమ్మెల్యేల ద్వారా అసెంబ్లీలో ప్రవేశించిన బీజేపీ.. ఈ సారి అధికారమే లక్ష్యంగా పనిచేస్తోంది. కాంగ్రెస్‌కు చెందిన కీలక నేతలను పార్టీలో చేర్చుకుంది.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఈ ఎన్నికలు కీలకం కానున్నాయి. ముఖ్యంగా అసోంలో అధికారం నిలబెట్టుకోవడంతో పాటు.. పశ్చిమ బెంగాల్‌లో రాణించడం ఆ పార్టీకి ముఖ్యం. ఒకవేళ ఈ రెండు చోట్లా ఓడితే కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకత అనే ముద్ర పడే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఒకే ఒక్క రాష్ట్రానికి పరిమితమైన సీపీఎంకు కేరళ ఎన్నికలు ప్రతిష్టాత్మకం కానున్నాయి. ఇప్పటికే బెంగాల్‌, త్రిపురలో అధికారానికి దూరమై ప్రాభవం కోల్పోయిన ఆ పార్టీకి.. ఈ ఎన్నికలు సవాల్‌తో కూడుకున్నవే. రెండేసి సార్లు అధికారంలోకి వచ్చిన తృణమూల్‌, అన్నాడీఎంకే పార్టీలు.. ప్రభుత్వ వ్యతిరేకతను దాటుకుని మళ్లీ అధికారం చేపట్టడం అంత సులువేమీ కాదని పొలిటికల్‌ ఎక్స్‌పర్ట్స్‌ అంటున్నారు. మరి ఈ పంచతంత్రంలో... గెలుపెవరిదో తెలియాలంటే మే2 వరకు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: