బ్లాక్ ఫంగస్.. ఇప్పడు కరోనా వచ్చిన వారిని వణికిస్తున్న మరో మాయదారి రోగం. కరోనా నుంచి కోలుకున్నా ఈ వ్యాధి పీడిస్తోంది. ఇప్పటికే ఏపీ, తెలంగాణలో ఈ బ్లాక్ ఫంగస్ కేసులు బయటపడుతున్నాయి. అనేక మంది మృత్యువాత పడుతున్నారు. ఇది చాలా అరుదుగా వచ్చే వ్యాధి కావడంతో దీని ఔషధాలు కూడా అంత సులభంగా దొరకడం లేదు. అందుకే బ్లాక్‌ ఫంగస్‌ బాధితుల్లో చికిత్స కోసం వినియోగిస్తున్న ఔషధాల వినియోగాన్ని క్రమబద్ధీకరించాలని  తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకొంది.

బ్లాక్ ఫంగస్‌ చికిత్స కోసం లిపోసోమల్‌ ఆంఫొటెరిసిన్‌ బి, పొసకొనజోల్‌’, ఐసవుకొనజోల్‌ వంటి మందులు వాడతారు. ఇవి యాంటీ ఫంగల్‌ ఔషధాలు. బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం ఈ మందులు అవసరం. ఇప్పుడు కరోనా నుంచి కోలుకున్న వారిలో కొందరికి బ్లాక్ ఫంగస్ వస్తోంది. క్రమంగా  ఈ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతోంది. దీంతో ఆ మందులకు హఠాత్తుగా డిమాండ్‌ పెరిగింది. సాధారణంగానే మన బ్లాక్ మార్కెటింగ్ మాయగాళ్లు ఈ మందులను అప్పడే బ్లాక్ మార్కెట్‌కు తరలించేశారు.

అందుకేఈ మందులు షాపుల్లో దొరకడం లేదు. ఉత్పత్తి సంస్థల నుంచి నేరుగా కొన్ని ఆసుపత్రులకు ప్రధాన డీలర్లకు చేరుతున్నాయి. ఈ మందులెన్ని వస్తున్నాయో.. ఎన్ని ఎవరెవరికి ఇస్తున్నారనే కచ్చితమైన సమాచారం ప్రభుత్వం వద్ద కూడా లేదు. ఇప్పుడు ఈ మందుల కోసం విజ్ఞప్తులు పెరగడంతో  ప్రభుత్వం దీనిపై ఓ విధానం ఉండాలని భావించింది. ఈ మందుల వాడకం, నియంత్రణపై  నిపుణుల కమిటీని నియమించింది. ఈ కమిటీలో వైద్యవిద్య సంచాలకులు, కోఠి ఈఎన్‌టీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌, గాంధీ ఆసుపత్రి ఈఎన్‌టీ విభాగాధిపతి సభ్యులు.

ఇకపై బ్లాక్ ఫంగస్‌కు ఈ యాంటీ ఫంగల్‌ ఔషధాలు అవసరమని వైద్యుడు ప్రిస్కిప్షన్‌లో రాస్తే.. దాన్ని జతచేస్తూ ప్రత్యేక దరఖాస్తు పత్రాన్ని నిపుణుల కమిటీకి పంపించాలి. నిపుణుల కమిటీ పరిశీలించి కొనుగోలుకు అనుమతిస్తుంది. ఏ స్టాకిస్టు వద్ద నుంచి మందు దొరుకుతుందో కూడా కమిటీ చెబుతుంది. ఈ బ్లాక్ ఫంగస్ మందుల కోసం dme@telangana.Gov. , ent-mcrm@telangana.gov.in కు ఈ మెయిల్ చేయాలి. ఈ విషయాన్ని కేటీఆర్ తన ట్విట్టర్‌లో పంచుకున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: