భారత్ లో 18సంవత్సరాల లోపు పిల్లలకు వచ్చే నెల నుంచి కోవిడ్ వ్యాక్సిన్ వేసే అవకాశం ఉందని కేంద్ర ఆరోగ్యమంత్రి మన్ సుఖ్ మాండవీయ తెలిపారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో ఆయన ఈ మేరకు ప్రకటించారు. కాగా పిల్లల వ్యాక్సిన్ సెప్టెంబర్ లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా ఇటీవలే ప్రకటించారు.

అంతేకాదు కరోనా సమయంలో ఎక్కువగా వినియోగంలోకి వచ్చిన.. హ్యాండ్ శానిటైజర్లకు ఔషధ గుర్తింపు ఇవ్వలేదని కేంద్రం స్పష్టం చేసింది. పార్లమెంట్ లో ఎంపీ రంజిత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ సమాధానమిచ్చారు. హ్యాండ్ శానిటైజర్లను క్రిమి సంహారంగా మాత్రమే అంగీకరించినట్టు చెప్పారు. దేశీయ సంస్థల నుంచి విజ్ఞప్తుల మేరకు హ్యాండ్ శానిటైజర్లపై జీఎస్టీని 18నుంచి 5శాతానికి తగ్గించామని పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే ఫైజర్ లేదా ఆస్ట్రాజెన్ కా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 3నెలల తర్వాత యాంటీ బాడీల క్షీణత ఉంటోందట. వ్యాక్సిన్ తీసుకున్న 10వారాల తర్వాత 50శాతం యాంటిబాడీలు క్షీణిస్తున్నట్టు యూనివర్సిటీ కాలేజ్ లండన్ పరిశోధకులు గుర్తించారు. ఇలా జరిగితే కొత్త వేరియంట్లను అడ్డుకోలేమన్నారు. అయితే ఈ రెండు వ్యాక్సిన్లలో ఏది తీసుకున్నా మొదట్లో మాత్రం అధికంగా యాంటీ బాడీలు ఉత్పత్తి అవుతున్నట్టు చెప్పారు.

ఇక కరోనా కేసుల విషయానికొస్తే.. భారత్ లో గడిచిన 24గంటల్లో 29వేల 689మందికి కరోనా సోకినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజాగా మహమ్మారికి మరో 415మంది బలైనట్టు తెలిపింది. ప్రస్తుతం దేశంలో 3లక్షల 98వేల 100యాక్టివ్ కేసులున్నాయని పేర్కొంది. అటు ఇండియాలో ఇప్పటి వరకు 44.19కోట్ల మందికి పైగా కరోనా వ్యాక్సిన్ ఇచ్చినట్టు వివరించింది.

ఇక ఏపీలో గత 24గంటల్లో 61వేల 298కరోనా టెస్టులు చేయగా.. 1,540మందికి పాజిటివ్ వచ్చినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. నిన్న కరోనాతో 19మంది చనిపోయారు. మొత్తం కేసుల సంఖ్య 19లక్షల 57వేల 932కు చేరగా.. ఇప్పటి వరకు 13వేల 292మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24గంటల్లో 2వేల 34మంది కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 20వేల 965గా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: