దీపావళి వేళ.. బేరియం లవణాలున్న టపాసులను అమ్మొద్దని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాలను పక్కాగా అమలు చేయాలని అధికారులను ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. కాగా బేరియం సాల్ట్ తో తయారు చేసిన క్రాకర్స్ ను అమ్మొద్దని గతంలో అత్యున్నత న్యాయస్థానం  ఆదేశాలు జారీ చేసింది.

దీపావళి పండుగకు బాణా సంచా కాల్చడం క్రమేణా తగ్గుతోంది. పెరుగుతున్న కాలుష్యం, ధరలు, కోర్టుల ఆంక్షలు లాంటి కారణాల వల్ల ప్రజలు రానురాను పటాకులు కాల్చడం తగ్గిస్తున్నారు. ఈ మేరకు లోకల్ సర్కిల్స్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో 42శాతం కుటుంబాలు బాణా సంచా నిషేధాన్ని సమర్థించగా.. 53శాతం కుటుంబాలు వ్యతిరేకించాయి. 63శాతం పురుషులు, 37శాతం మంది స్త్రీలు ఈ సర్వేలో పాల్గొన్నారు.

దీపావళి సందర్భంగా టపాసులు కాల్చే సమయంలో విషాదకర ఘటనలు వింటూనే ఉంటాం. ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. బాణసంచా కాల్చే సమయంలో కాటన్ దుస్తులు ధరించడం మేలు. ఇంటిలోపల టపాసులు కాల్చవద్దు. బహిరంగ ప్రదేశాల్లోనే కాల్చండి. బాణాసంచా కాల్చేటప్పుడు ఫస్ట్ ఎయిడ్ కిట్ తో పాటు బకెట్ లో నీటిని అందుబాటులో ఉంచుకోండి. పెద్ద శబ్దాలు వచ్చే టపాసులకు పిల్లలను దూరంగా ఉంచండి.

ఇంకో విషయం ఏంటంటే.. దీపావళి బాణాసంచా వల్ల పెరిగే వాయుకాలుష్యం కొవిడ్ వ్యాప్తికి కారణం కావొచ్చని నిపుణులు అంటున్నారు. సాధారణ సమయల్లో కంటే కాలుష్యం ఎక్కువగా ఉన్న సమయాల్లో కరోనా తీవ్రంగా వ్యాప్తి చెందుతుందని చెప్పారు. బాణసంచా వల్ల కలిగే కాలుష్యాన్ని వైరస్ కణాలు వాహకంగా చేసుకుంటాయని తెలిపారు. ఇప్పటికే కోవిడ్ బారిన పడి ఊపిరితిత్తులు దెబ్బతిన్నవారు, అలర్జిక్ ఇన్ ఫెక్షన్లకు గురయ్యే వారిలో ముప్పు ఎక్కువ అని చెప్పారు. మొత్తానికి టపాసులతో ఎంతదూరంగా ఉంటే అంత మంచిదని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు.









మరింత సమాచారం తెలుసుకోండి: