కుప్పంలో చంద్రబాబుకి ఇంతవరకు సొంత ఇల్లు లేదా.. ఇది కాస్త ఆలోచించాల్సిన విషయమే. అయితే ఈ విషయం కుప్పం సమీక్షలో బయటపడింది. ఓ కార్యకర్త ఆయన్ను కుప్పంలోనే ఇల్లు కట్టుకోవాలంటూ సలహా ఇచ్చారు. ఎందుకో కూడా వివరించారు. కుప్పం రాజకీయ సమీక్షలో ఊహించని ఈ సూచనతో బాబు షాకయ్యారు. కుప్పం పర్యటనకు వచ్చిన చంద్రబాబుకి కనీసం గెస్ట్ హౌస్ కూడా ఇవ్వడంలేదని, ఇచ్చినా అక్కడ అధికార పార్టీ వాళ్లు కరెంట్ కట్ చేస్తున్నారని వారు చెప్పారు. దీంతో చంద్రబాబు కూడా తాను కుప్పంలో ఇల్లు కట్టుకుంటానని అన్నారు.

తాజాగా చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో పార్టీ నేతలతో రివ్యూ నిర్వహించారు. ఈ రివ్యూలో చంద్రబాబు పదునైన వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడూ ప్రతిపక్షాలను టార్గెట్ చేసే చంద్రబాబు, ఈసారి రూటు మార్చి సొంత పార్టీ నేతలపైనే ఘాటు వ్యాఖ్యలు ఎక్కు పెట్టారు. టీడీపీలో కోవర్టులు ఎక్కువయ్యారని సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో పని చేయకుండా.. వైసీపీకి కోవర్టులుగా పని చేస్తున్నవారిని ఏరి పారేస్తానంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో ఓటమికి కోవర్టులే కారణమని తెలిసిందని అన్నారు. అతివిశ్వాసమే కొంపముంచిందని అంచనాకు వచ్చారు. కుప్పంలోనే ఇల్లు కట్టుకుంటానని, ఇకపై ఇక్కడే ఉండి తానేంటో చూపిస్తానని పార్టీ నేతలకు భరోసా ఇచ్చారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ ప్రక్షాళనకు సిద్ధమయ్యారు. ఇప్పటివరకూ తనను మెప్పించి పార్టీ పదవులు అనుభవించిన వారిని పక్కనపెట్టేస్తానని సంచలన ప్రకటన చేశారు. ప్రజల్లో పార్టీ పట్ల ఉన్న అభిప్రాయాన్ని మార్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. పని చేసే నాయకులకే ఇకపై ప్రాధాన్యత ఇస్తానని అన్నారు. చంద్రబాబు ప్రకటనతో టీడీపీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతల్లో చర్చ మొదలైంది. పార్టీలో సీనియర్ లీడర్లమని, లేదంటే చంద్రబాబు సామాజిక వర్గం పేరు చెప్పి ఇన్నాళ్లూ రాజకీయాలు చేసిన వారందరినీ పక్కన పెట్టబోతున్నారని సమాచారం రావడంతో ఆయా నేతల్లో అంతర్మధనం మొదలైంది.

టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలు టీడీపీలో పెద్ద చర్చకే దారి తీశాయి. నేరుగా పార్టీ నేతలనే టార్గెట్ చేయడం, అనుమానించడం ఏమిటంటూ టీడీపీ నేతలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. పార్టీ కోసం తాము కష్టపడుతుంటే ఇలా అవమానిస్తారా అని కుప్పంలో పలువురు టీడీపీ నేతలు మాట్లాడినట్టు సమాచారం. ఇదిలా ఉండగా పార్టీ ప్రక్షాళన పేరుతో సొంత సామాజిక వర్గాన్ని చంద్రబాబు ఎందుకు వదులుకుంటున్నారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. చంద్రబాబు చెప్పినంత తేలికగా పార్టీలో ప్రక్షాళన వీలవుతుందా అనేది కూడా ఆలోచించాల్సిన విషయమే. మొత్తానికి చంద్రబాబు కుప్పం వాస్తవ్యుడిగా మారబోతున్నారన్న మాట. ఇన్ని రోజులూ వాడుతున్న పాత ఫార్ములాలన్నీ పని చేయకపోవడంతో కొత్త దారులను వెదుకుతున్నారన్నది మాత్రం స్పష్టంగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: