ఉరుము ఉరిమి ఇప్పుడు హెరిటేజ్ పై పడేలా ఉంది. ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి ఇప్పుడు హెరిటేజ్ పాల ప్యాకెట్ రేట్లు తగ్గించాలి అనే వరకు వచ్చింది. ఈ వ్యవహారాన్ని అలా అన్ని రకాలుగా మలుపులు తిప్పేశారు నెటిజన్లు. ఏపీలో సినిమా టికెట్ల రేట్లు తగ్గించిన తర్వాత సోషల్ మీడియాలో విపరీతంగా మీమ్స్ పుట్టుకొచ్చాయి. నిత్యావసరాల రేట్లు తగ్గించలేని వైసీపీ ప్రభుత్వం సినిమా టికెట్ల రేట్లు మాత్రం ఎందుకు తగ్గించిందని మండిపడుతున్నారు కొంతమంది. టికెట్ రేట్లు తగ్గించినంత మాత్రాన సామాన్యుడికి కలిగే ఉపయోగం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దాని బదులు నిత్యావసరాల రేట్లు తగ్గించొచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు.

టీడీపీ నుంచి సెటైర్లు..
సినిమా టికెట్ల రేట్లు తగ్గించి ఇండస్ట్రీని నష్టాల్లో ముంచేసే బదులు వైసీపీకి చెందిన సాక్షి పేపర్, భారతి సిమెంట్ బస్తా రేట్లు తగ్గించొచ్చు కదా అనే ప్రశ్నలు మొదలయ్యాయి. టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బుచ్చయ్య చౌదరి ఈ విషయంలో సెటైర్ పేల్చారు. భారతి సిమెంట్ బస్తా రూ.100కే అమ్మాలని డిమాండ్ చేశారు. అలా రేట్లు తగ్గిస్తారా అని ప్రశ్నించారు. దీంతో వైసీపీ సానుభూతి పరులు దీన్ని మరో యాంగిల్ లో మార్చేశారు. మీరు హెరిటేజ్ పాల ప్యాకెట్ రేటు తగ్గిస్తారా అని అడుగుతున్నారు. లీటర్ పాల ప్యాకెట్ పది రూపాయలకే ఇవ్వొచ్చు కదా అని అడుగుతున్నారు.

ప్రస్తుతం ఏపీలో సినిమా టికెట్ రేట్ల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. సినిమా టికెట్ల రేట్లు తగ్గించడం సమంజసమేనని కొందరు, కాదు కాదు తగ్గించడం వల్ల ఉపయోగం లేదని మరికొందరు వాదులాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో మాత్రం లెక్కలేనన్ని మీమ్స్ వచ్చిపడుతున్నాయి. దీంతో ఇప్పుడు ఇలా ఆ వస్తువు రేటు తగ్గించొచ్చు కదా అంటే, ఈ వస్తువు రేటు తగ్గించొచ్చు కదా అని ఒకరినొకరు ప్రశ్నించుకుంటున్నారు. ఈ వ్యవహారం ముఖ్యంగా రాజకీయ రంగు పులుముకుంది. టీడీపీకి చెందిన వ్యాపారాల విషయాన్ని వైసీపీ నేతలు హైలెట్ చేస్తుంటే.. వైసీపీకి చెందిన వ్యక్తుల వ్యాపార కార్యకలాపాలను టీడీపీ నేతలు సీన్ లోకి తెస్తున్నారు. ఇలా రేట్ల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. చివరకు భారతి సిమెంట్ బస్తా, హెరిటేజ్ పాల ప్యాకెట్ వరకు వచ్చింది. సినిమా టికెట్ల నుంచి మొదలైన కథ.. చివరకు పాల ప్యాకెట్ వరకు వచ్చింది. నిజంగానే పోటీ పోటీగా అన్నిటి ధరలు దిగొస్తే ఎంత బాగుంటుందో కదా..

మరింత సమాచారం తెలుసుకోండి: