ఎవ్వ‌రూ  ఎవ్వ‌రికీ ఏమీ నేర్ప‌కూడదు. ఎవ్వ‌రు రాసినా ఓ అసాధార‌ణ రీతి ఉండాలి..మ‌త్తు లోగిళ్ల‌లో జోగిన రాత్రుల చెంత నిషాదం అయిన స్వ‌రం ఒక‌టి వినిపిస్తూ ఉంటుంది.మ‌నిషి త‌న‌ని తాను బానిస గా మార్చుకుని నేల‌కి ఒళ్ల‌ప్ప‌గిస్తాడు.. నింగికి గుడ్ల‌ప్ప‌గిస్తాడు.. చూపు స‌వ‌రించుకున్నాక జీవితం తేట‌తెల్లం అవుతుంది. కానీ నాటు సారా దారుల్లో ఇవ‌న్నీ కాన‌రావు.మ‌నుషుల్లో నీతి అనే మాయ పొర‌లు ఎప్ప‌టికీ ఉంటూనే ఉంటాయి..క‌రిగి క‌న్నీరయ్యాక జీవితంలో అత్యంత అసంద‌ర్భ ప్రేలాప‌న‌లే వెన్నంటే ఉంటాయి.మ‌నిషి మాయా విచ్ఛిత్తిని కోరుకోక‌పోవ‌డం వ‌ల్ల‌నే విషాదాంతాల‌ను కూడా హాయిగానే దాటుకు వ‌స్తున్నాడు. ఈ పొర‌లు తొల‌గించ‌క‌పోవ‌డం ప్ర‌భువు చేయ‌ని ప‌ని.. తొల‌గినా వెలిగినా జీవితం ఒక వెలుగు కాగ‌డా కాదు.

క‌ల్లు గీసే వాళ్లెవ్వ‌రో మొన్న చాలా కాన్ఫిడెంట్ గా క‌నిపించారు..రైలు బండి తోవ‌లు ఎదురుగా ఉన్నాయి.పాట పాడే వాడు ఎక్క‌డో ఏదో ఒక‌టి వినిపిస్తాండు.క‌ల్లూ గిల్లూ వ‌ద్దు కానీ స్వీయ సంస్కారం లోకానికి మ‌త్తులో అయినా అల‌వ‌డుతుందా అని న‌వ్వుకున్నాను.మూడ్రోజుల మత్తుకు మ‌నిషి వీధుల చెంత తిరుగుతాడు..మురికి కాలువల చెంత ఒట్టిపోయిన దేహాల‌ను దొర్లిస్తాడు. మ‌నిషి దాగుడు మూత‌లు తీరాక ఉదయాలు సాయంత్రాలు ఇంకా ఇంకొన్ని స‌మ‌యాల చెంత వికారాలు అర్థం అయి ఉంటాయి వాళ్ల‌కు!
మ‌నుషుల్లో బాధ్య‌త లేక‌పోవ‌డంతో భోగి పండుగ వేళ‌లు ఎందుక‌ని విరాజిల్ల‌డం లేదో అర్థం అయి ఉంది. కాంతి వాదం ఒక‌టి వినిపిస్తుంటే చీక‌టి న‌వ్వుల కిల‌కిల చెంత ప్ర‌తి ర‌వ‌మూ బాగుంది. ర‌వ‌మూ అంటే శ‌బ్ద‌ము.. శాబ్దిక సౌంద‌ర్యాల్లో ప‌ల్లెలు లేవు. నాటు సారా దారుల్లో ప‌ల్లెలు ఉన్నాయి. పాల‌కుల‌కు ఇవి చెప్పాలి.. నా మాట వింటారా.. నా తోటి ప్రియ జ‌నులారా ! మీరు కూడా వాళ్ల మెద‌ళ్ల‌కు ఓ మాట చెప్పండి. ముందు సంస్క‌ర‌ణ అన్న‌ది ప‌ల్లె నుంచి రావాలి అని!

 
జీవితం ఎలా ఉంది స‌ర్ మూడు పువ్వులూ మ‌రియు ఇంకా ఇంకొన్ని న‌వ్వులు.ప‌ల్లె చూసి ప‌ట్నం న‌వ్వింద‌ని చ‌దివేను.ఛ‌! అస‌లు న‌గ‌రమే ప‌ల్లెను చూసి ఫ‌క్కున న‌వ్వుతోంది.అస‌లు కార్పొరేట్ శ‌క్తుల‌న్నీ ప‌ల్లెల్లో మోహ‌రించి ఉన్నాయ‌ని గోర‌టి పాట రాశాడు. న‌వ్వుకున్నాను.పాట‌లో కాదు జీవితంలో కూడా ఏమీ లేదు.మ‌నం శ‌క్తుల‌ను ఆవహించి ఆహ్వానించి సంస్క‌ర‌ణాయుతంగా పోవ‌డం జ‌ర‌గ‌ని ప‌ని.సంస్క‌ర‌ణ సైన్సు అవుతుందా?మ‌రి! ఆర్ట్సు! అది ఆలోచ‌న అయి ఉండాలి.
అయి ఉంటుంది కూడా! రోజులో కొన్ని ఆలోచ‌న‌ల కార‌ణంగా ఆర్ట్సూ సైన్సూ గొడ‌వ గాడిన ప‌డ‌డం లేదేమో!

 
ఫొటో : మ‌న్నెం శార‌ద

మరింత సమాచారం తెలుసుకోండి: