భారత్ లో థర్డ్ వేవ్ ప్రభావం తగ్గాలంటే ఏప్రిల్ వరకు వేచి చూడాల్సిందే. ఇటీవల ఓ సర్వే సారాంశం ఇది. అయితే కేసుల వ్యాప్తి తీవ్రంగా ఉంటేనే ఏప్రిల్ వరకు వేచి చూడాల్సి వస్తుందని, కేసుల సంఖ్యలో పెరుగుదల 30 నుంచి 60శాతం మధ్యలో ఉంటే.. ఫిబ్రవరి రెండోవారం నాటికి థర్డ్ వేవ్ ప్రభావం తగ్గుతుందని కూడా అదే సర్వే తేల్చి చెప్పింది. ఇప్పుడు ఈ రెండోదే నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒమిక్రాన్ పుట్టిల్లుగా చెబుతున్న దక్షిణాఫ్రికాలో దాని ప్రభావం తగ్గుతోంది. అటు బ్రిటన్ లో కూడా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. భారత్ లో కూడా కేసుల తీవ్రత ఉన్నట్టుండి అదుపులోకి వచ్చింది. మూడు రోజుల క్రితం వరకు భారీగా పెరుగుతున్న కేసులు 3 లక్షలు దాటిపోతాయని అంచనాలున్నా.. ఆ బోర్డర్ దాటలేదు. రెండురోజులుగా మొత్తం కేసుల పెరుగుదలలో తేడా స్పష్టంగా తెలుస్తోంది.

ఢిల్లీలో నిన్న మొన్నటి వరకు భారీగా పెరిగిన కేసుల సంఖ్య ఇప్పుడిప్పుడే తగ్గుతోంది. రికవరీ రేటు స్పీడ్ గా ఉంది. ఢిల్లీలో గడచిన 24గంటల్లో ఆరు వేల కేసులు తగ్గాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పాజిటివిటీ రేటు ఎక్కువగానే ఉన్నా కూడా.. కోలుకున్న వారి సంఖ్య కూడా అదే స్థాయిలో ఉండటం ఊరటనిచ్చే అంశం. ఆస్పత్రిపాలయ్యేవారి సంఖ్య, మరణాల సంఖ్య థర్డ్ వేవ్ లో బాగా తక్కువగా ఉందని అంటున్నారు. దీంతో ఢిల్లీలో కర్ఫ్యూ పెట్టడానికి ప్రభుత్వం ఇష్టపడటం లేదు. కేవలం వీకెండ్ కర్ఫ్యూ మాత్రమే అమలులో ఉంది.

దక్షిణాదిలో డెల్టా ప్రభావం ఎక్కువ..
ఒమిక్రాన్ కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో రికవరీ రేటు బాగా ఉంది, కానీ దక్షిణాదిలో మరోసారి డెల్టా విజృంభిస్తోంది. ముఖ్యంగా ఏపీలో.. ఒమిక్రాన్ కేసుల పెరుగుదల తక్కువగా ఉన్నా కూడా డెల్టా వేరియంట్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఆయా శాంపిల్స్ ని ఒమిక్రాన్ వేరియంట్ టెస్ట్ కోసం పంపిస్తే, ఫలితాలు ఎలా ఉంటాయో తెలియదు కానీ, ప్రస్తుతానికి కొత్తగా నమోదవుతున్న కేసులన్నిటినీ డెల్టాగానే పరిగణిస్తున్నారు. విదేశీ ప్రయాణాలు, విదేశాలనుంచి వచ్చినవారితో సంబంధాలు ఉంటేనే ఒమిక్రాన్ టెస్ట్ చేయిస్తున్నారు. అంటే దక్షిణాది రాష్ట్రాల ప్రజలు డెల్టాతో అప్రమత్తంగా ఉండటం మాత్రం అత్యవసరం.

తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. తెలంగాణలో స్కూల్స్ మూసేశారు, నైట్ కర్ఫ్యూ పెట్టలేదు. ఏపీలో నైట్ కర్ఫ్యూ అమలులోకి వచ్చింది, స్కూల్స్ నడుపుతున్నారు. ఇలా ఎవరి వెసులుబాటు ప్రకారం వారు నిబంధనలు అమలు చేస్తున్నారు. ఉత్తరాదిన ఒమిక్రాన్ ప్రభావం తగ్గడం సంతోషించదగ్గ పరిణామమే అయినా, దక్షిణాదిన ఇంకా డెల్టా జాడలు ఉండటం మాత్రం ఆందోళన కలిగించే విషయం.

మరింత సమాచారం తెలుసుకోండి: