జనసేన అధినేత పవన్ కల్యాణ్ అసలు రాజకీయాల్లోకి ఎందుకొచ్చారో ఎవరికీ అర్ధంకావటంలేదు. మిగిలిన ప్రతిపక్షాలను పుట్టిముంచటానికే వచ్చారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మాటస్ధిరత్వం లేకపోవటం, విషయ పరిజ్ఞానం లేకపోవటం, జగన్మోహన్ రెడ్డికన్నా తాను చాలా అధికుడనని భ్రమల్లో ముణిగిపోవటమే అసలు సమస్య. రాజకీయంగా తాను ఎలాంటి పాత్రను పోషించాలని అనుకుంటున్నారో మిగిలిన వాళ్ళకు కాదు కనీసం తనకన్నా క్లారిటి ఉందో లేదో అర్ధంకావటంలేదు.

ఎందుకంటే రెండురోజుల క్రితం పార్టీ ఆఫీసులో మాట్లాడుతు తనకు ముఖ్యమంత్రి అయిపోవాలని లేదన్నారు. అంతకుముందు రణస్ధలంలో మాట్లాడుతు తనను ముఖ్యమంత్రిని చేస్తే సుపరిపాలన అంటే ఎలాగుంటుందో చేసి చూపిస్తానన్నారు. అంతకుముందు విజయనగరం పర్యటనలో మాట్లాడుతు జనసేనకు అధికారం అప్పగించాలని రిక్వెస్టుచేశారు. అప్పుడెప్పుడో మాట్లాడుతు తాను సమాజంలో మార్పు తెచ్చేందుకు 25 ఏళ్ళ రాజకీయం చేయటానికి సిద్ధపడే వచ్చానన్నారు.

ఇలా తడవకొక మాట పూటకొక ప్రకటన చేస్తుండటంతో మామూలు జనాలకు కాదు చివరకు పార్టీలోని నేతలకు కూడా పిచ్చెక్కిపోతోంది. పొత్తులపైన కూడా రోజుకోమాట మాట్లాడుతున్నారు. మొన్నేమో ప్రత్యేకవాదం వినిపించే వాళ్ళ తాట తీస్తానని వార్నింగ్ ఇచ్చారు. అంతకుముందొకసారి మాట్లాడుతు అభివృద్ధంతా అమరావతి చుట్టుపక్కల చేస్తున్న కారణంగానే ప్రత్యేక రాయలసీమ, ప్రత్యేక ఉత్తరాంధ్ర డిమాండ్లు వస్తున్నాయని చెప్పారు. పాలకులకు ముందుచూపు లేనికారణంగానే ప్రాంతీయవాదనలు పెరిగిపోతున్నట్లు చెప్పారు.

అంటే పవన్ మాటలను చూస్తుంటే ఈరోజు మాట్లాడిందానికి రేపు పూర్తి విరుద్ధంగా మాట్లాడుతారు. ఇలాంటి ప్రకటనలు విన్నతర్వాతే పవన్లో ఏమైనా సమస్యలున్నాయా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. జరుగుతున్నది చూస్తుంటే పవన్ను నమ్ముకుంటే ముణిగిపోవటం ఖాయమనే ఆలోచన ఇతర పార్టీల్లోను, పార్టీ నేతల్లోను మొదలైందంటే అది వాళ్ళ తప్పుకానేకాదు. ఎన్నికల ప్రకటనకు వారం ముందుమాత్రమే పొత్తుల విషయాన్ని ఫైనల్ చేస్తామని పవన్ ప్రకటించారంటేనే ఆయన ఆలోచనా విధానం అర్ధమైపోతోంది. ముందు ముందు ఇంకెన్ని విచిత్రమైన ప్రకటనలు చేస్తారో ? ఎవరెవరికి వార్నింగులిస్తారో ? అర్ధం కావటంలేదు. మొత్తానికి మంత్రులు, వైసీపీ నేతలు చెబుతున్నట్లు పవన్ చివరకు కామెడీ పీస్ గా మిగిలిపోతారేమో.  


మరింత సమాచారం తెలుసుకోండి: