రెండుపార్టీల్లోను సేమ్ సీన్ రిపీటవుతోంది. కాకపోతే నియోజకవర్గాలు, స్ధానాలు మాత్రమే వేర్వేరు. ఇంతకీ విషయం ఏమిటంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తలెత్తిన సమస్యను పరిష్కరించేందుకు తమ్ముడికే పార్టీపగ్గాలు అప్పగించాలని జగన్మోహన్ రెడ్డి దాదాపు డిసైడ్ అయినట్లు సమాచారం.  ఎంఎల్ఏ కోటంరెడ్డి శ్రీధరరెడ్డి ఒక్కసారిగా ప్రభుత్వ వ్యతిరేక వైఖరి మొదలుపెట్టారు. ప్రభుత్వంపై బహిరంగంగా  పదేపదే ఆరోపణలు చేస్తున్నారు. దాంతో శ్రీధర్ పార్టీని వదిలేయాలని డిసైడ్ అయిన తర్వాతే ఇలా వ్యవహరిస్తున్నారని అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి.





ఎంఎల్ఏకి ప్రత్యామ్నాయంగా నియోజకవర్గం ఇన్చార్జి బాధ్యతలను ఆయన తమ్ముడు, జగన్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు కోటంరెడ్డి గిరిధరరెడ్డికే అప్పగించాలని కూడా అనుకున్నారు. ఎంఎల్ఏకి పార్టీతో వచ్చిన గ్యాప్ కారణంగా వచ్చేఎన్నికల్లో తమ్ముడు గిరిధరరెడ్డికే టికెట్ ఇవ్వాలని కూడా పార్టీ ఆలోచిస్తున్నది. ఎంఎల్ఏ తొందరలోనే టీడీపీలో చేరుతారని అనుమానిస్తున్నది. అయితే శ్రీధర్ మాత్రం తాను రాజకీయాలనుండి విరమించుకుంటానని చెబుతున్నారు.





ఇలాంటి సీనే టీడీపీలో కూడా జరుగుతున్న విషయాన్ని గమనించాలి. విజయవాడ ఎంపీ కేశినేని నానీకి చంద్రబాబునాయుడుకు బాగా గ్యాప్ వచ్చేసింది. నానీ కూడా చంద్రబాబుతో పాటు పార్టీలోని లోపాలపై బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబుపై ఎంపీ తిరుగుబాటు చేసినట్లుగానే ఉంది. అందుకనే నానీ తమ్ముడు చిన్నీని చంద్రబాబు తెరమీదకు తెచ్చారు. వచ్చేఎన్నికల్లో ఎంపీగా చిన్నీనే పోటీచేయించబోతున్నట్లు చంద్రబాబు సంకేతాలు పంపుతున్నారు. దీంతో ఎంపీ మరింతగా మండిపోతున్నారు. చిన్నీ కూడా నియోజకవర్గమంతా ఎంపీ అభ్యర్ధి హోదాలో పర్యటనలు చేసేస్తున్నారు.





చూస్తుంటే టీడీపీలో ఎంపీ కేశానేని నాని, వైసీపీలో ఎంఎల్ఏ కోటంరెడ్డి శ్రీధరరెడ్డి వైఖరి ఒకేలాగుంది. ఇటు జగన్ అటు చంద్రబాబు వీళ్ళతో బాగా ఇబ్బందులు పడుతున్నారు. కోటంరెడ్డికన్నా ముందే వెంకటగిరిలో ఎంఎల్ఏ ఆనం రామనారాయణరెడ్డి గోల మొదలుపెట్టారు. అయితే జగన్ కు అత్యంత సన్నిహితుల్లో కోటంరెడ్డి కూడా ఒకళ్ళు. అలాంటి కోటంరెడ్డి జగన్ కు వ్యతిరేకం అవటమే ఆశ్చర్యంగా ఉంది. ఢిల్లీకి వెళ్ళిన జగన్ తిరిగొచ్చిన వెంటనే ఈ విషయమై తేల్చేస్తారని పార్టీవర్గాలు చెబుతున్నాయి. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: