డిక్లరేషన్లు, బహిరంగసభలతో మంచి ఊపుమీదున్న తెలంగాణా కాంగ్రెస్ పార్టీ వచ్చేనెల 10వ తేదీన బీసీ గర్జన పేరుతో మరో భారీ బహిరంగసభ నిర్వహించబోతోంది. హైదరాబాద్ శివార్లలోని షాద్ నగర్ లో బీసీ గర్జనకు పార్టీ ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ సభకు ముఖ్య అతిధిగా కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హాజరవబోతున్నారు. అలాగే ఏఐసీసీలోకి కొందరు ముఖ్యనేతలు కూడా రాబోతున్నారు. రాబోయే ఎన్నికల్లో బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని పార్టీలో కొంతకాలంగా డిమాండ్లు వినిపిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.





గతంలో ఎప్పుడూ లేనంతగా రాబోయే ఎన్నికల్లో పార్టీల గెలుపోటముల్లో కొన్ని సామాజికవర్గాలు కీలక పాత్ర పోషించబోతున్నాయి. మామూలుగా ఎప్పుడూ ఉండే తంతే అయినా ఇంత బాహాటంగా ఎప్పుడూ బయటపడలేదు. తెలంగాణా జనాభాలో కానీ ఓటర్లలో కానీ బీసీల జనాభానే ఎక్కువ. అందుకనే తమకు సరైన ప్రధాన్యత ఇవ్వాలని బీసీ సంఘాల నేతలు పట్టుబట్టారు.  ఒక అంచనా ప్రచారం బీసీ జనాభా సుమారు 70 నియోజకవర్గాల్లో పార్టీల గెలుపోటములను నిర్దేశించగలదు.





అందుకనే అంతకాకపోయినా 45-50 సీట్లు కచ్చితంగా బీసీలకు కేటాయించాల్సిందే అని పార్టోని బీసీ సంఘాల నేతలు గట్టిగా పట్టుబట్టారు. ఇదే విషయాన్ని ఒక మీటింగ్ పెట్టుకుని తీర్మానంచేసి అధిష్టానానికి పంపారు. దాంతో అన్నీ విషయాలను గమనంలోకి తీసుకున్న అధిష్టానం కనీసం ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోని  రెండు అసెంబ్లీ నియోజకవర్గాలను కచ్చితంగా బీసీలకు కేటాయించాలని డిసైడ్ అయ్యింది.





చివరకు ఎన్ని సీట్లను కేటాయిస్తుందో తెలీదుకనీ గతంలో ఎన్నడూ లేనంత ప్రాధాన్యత అయితే బీసీలకు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కల్పించబోతోన్నట్లు అర్ధమవుతోంది. ఎందుకంటే ఇప్పటికే టికెట్లను ప్రకటించిన కేసీయార్ బీఆర్ఎస్ లో రెడ్లకే అధిక ప్రాధాన్యత ఇచ్చారు. బీసీల జనాభా దామాషాలో టికెట్లు ఇవ్వటం సాధ్యంకానపుడు కనీసం అందరికన్నా ఎక్కువగా కేటాయించినా బాగానే ఉంటుంది. కానీ అలాకాకుండా ఓట్లు కావాలి సీట్లు మాత్రం ఇవ్వం అంటే ఇపుడు బీసీలు అంగీకరించే స్ధితిలో లేరు. అందుకనే పార్టీలు ఆచితూచి టికెట్లను ప్రకటిస్తున్నాయి. మరి బీసీ గర్జనలో ఎన్ని సీట్లు అడుగుతారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: