
ఎల్లోమీడియా వ్యవహారం చాలా దయనీయంగా తయారైంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాయటానికి, డిబేట్లు పెట్టడానికి వీళ్ళ దగ్గర కొత్తగా సబ్జెక్టు ఏమీలేదు. ఇదే సమయంలో స్కిల్ స్కామ్ లో చంద్రబాబునాయుడుకు సంబంధంలేదని ఎన్నిరోజులు పేజీలకొద్దీ వార్తలు, కథనాలు రాస్తున్నా జనాలు పట్టించుకోవటంలేదు. చంద్రబాబుకు మద్దతుగా కోర్టుల్లో ఎంతమంది లాయర్లు వాదిస్తున్నా ఎలాంటి ఫలితం కనబడటంలేదు. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు ఎప్పుడు బయటకు వస్తారో తెలీటంలేదు. మరీ పరిస్ధితుల్లో ఏమిచేయాలి ?
ఏమిచేయాలంటే జగన్మోహన్ రెడ్డి మీదున్న అవినీతి కేసులు ఎన్ని ? ఏ ఏ కేసుల విచారణ ఎంతవరకు వచ్చింది ? ఏ కేసులో జగన్ కు బెయిల్ వచ్చింది ? ఏఏ కేసులు ఏ కోర్టుల్లో పెండింగులో ఉన్నాయి లాంటి పాతచింతకాయ పచ్చడికే కొత్తగా పోపు పెట్టి వంటకం వండింది. ఎల్లోమీడియా ఛానల్లో పెద్ద డిబేట్ పెట్టి జగన్ వ్యతిరేకులతో గంటలకొద్ది మాట్లాడించి టన్నులకొద్దీ బురదచల్లేశామని సంతోషపడిపోయింది.
ఇపుడు లేటెస్ట్ హాట్ టాపిక్ చంద్రబాబు అవినీతి, స్కాముల్లో ఇరుక్కున్న విధానం, సీఐడీ దగ్గర ఉన్న డాక్యెముంటరీ సాక్ష్యాలు, బెయిల్ తెచ్చుకోవటం ఎలాగన్నది. పనిలోపనిగా ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ లో లోకేష్ పాత్ర, విచారణ, అరెస్టు భయం అన్నది మరో పాయింట్. పార్టీకి ప్రత్యామ్నాయ నాయకత్వం, భువనేశ్వరి, బ్రాహ్మణి పోషించబోయే పాత్రల గురించి డిబేట్లు పెడితే మామూలు జనాలు, పార్టీ అభిమానులైనా చూస్తారు. అంతేకానీ ఎప్పటివో జగన్ కేసులపై ఇప్పుడు డిబేట్లు పెడితే ఎవరు చూస్తారు ?
జగన్ అక్రమార్జన కేసులు, విచారణ అన్నది 12 సంవత్సరాల క్రితం చద్దివార్తలు. ఆ వార్తలపై నెలల తరబడి అప్పట్లోనే ఎల్లోమీడియా సీబీఐ విచారణకు ప్యారలల్ గా విచారణ, దర్యాప్తు, రన్నింగ్ కామెంట్రీ అన్ని ఇచ్చేశాయి. కాబట్టి జనాలకు జగన్ కేసుల్లో కొత్తగా చెప్పేదేమీ ఉండదు. ఇంతచిన్న లాజిక్ కూడా ఆలోచించకుండా పుష్కరకాలంనాటి అంశాలపై ఇపుడు డిబేట్లు పెట్టిందంటేనే ఎల్లోమీడియా దగ్గర జగన్ కు వ్యతిరేకంగా సబ్జెక్టు ఏమీలేదని అర్ధమైపోతోంది. జగన్ను వదిలిపెట్టలేక చంద్రబాబు వ్యవహారంపై డిబేట్లు పెట్టలేక ఎల్లోమీడియా సబ్జెక్టు లేమితో నానా అవస్తలు పడుతోంది.