రాజమండ్రి జైలులో 53 రోజులుగా రిమాండు అనుభవించిన చంద్రబాబునాయుడు అనారోగ్యంతో మధ్యంతర బెయిల్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. జైలులో ఉన్నన్ని రోజులు చంద్రబాబు అనారోగ్యంతో బాధపడుతున్నారని, జైలు అధికారులు పట్టించుకోవటంలేదని భువనేశ్వరి, లోకేష్ తో పాటు తమ్ముళ్ళు, ఎల్లోమీడియా చేసిన రచ్చంతా అందరికీ తెలిసిందే. చంద్రబాబుకు జైలు అధికారులు స్టెరాయిడ్స్ ఇస్తున్నారన్న అనుమానాన్ని కూడా లోకేష్ వ్యక్తంచేశారు. 5 కిలోల బరువు తగ్గిపోయారని భువనేశ్వరి అంటే కాదు కాదు 6 కిలోల బరువుతగ్గారని లోకేష్ గోల చేశారు.





జైలు వాతావరణం పడకపోవటంతో వేగంగా చంద్రబాబు బరువు తగ్గిపోతున్నారని అది కిడ్నీ పనితీరు మీద ప్రభావం చూపే ప్రమాదముందని భువనేశ్వరి జైలు ముందే గోల చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇదే కాకుండా నడుము నొప్పితో బాధపడుతున్నారని, వెన్నునొప్పి తీవ్రంగా ఉందని, నడుము కింద నుండి దద్దర్లు పెరిగిపోతున్నాయని, బీపీ, షుగర్ అదుపులో లేదని..ఇలా చాలా అనారోగ్యాలను పదేపదే ప్రస్తావించారు. అనారోగ్యాలంటున్నారు కదాని చివరకు కోర్టు కూడా మధ్యంతర బెయిల్ మంజూరుచేసింది.





సీన్ కట్ చేస్తే జైలు నుండి విడుదలైన తర్వాత చంద్రబాబు జాతిని ఉద్దేశించి పది నిముషాల పాటు ప్రసంగించారు. ఆయన మాట్లాడిన విధానం, నిలబడిన తీరు చూసిన తర్వాత అసలు చంద్రబాబుకు అనారోగ్యం ఉందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. కంటికి క్యాటరాక్ట్ ఆపరేషన్ సంగతి బయటకు తెలీదు కానీ మిగిలిన అనారోగ్యాలేవి ఉన్నట్లు అనిపించలేదు.  సహజ శైలిలో జగన్నోహన్ రెడ్డిని వ్యక్తిగతంగాను, వైసీపీ ప్రభుత్వాన్ని ఒక్కమాట కూడా మాట్లాడలేదు. రాజమండ్రి నుండి విజయవాడ కరకట్ట దగ్గరకు 15 గంటలు ర్యాలీలో పాల్గొన్నారు. రోగాలతో ఇబ్బందులు పడుతున్న చంద్రబాబు అన్నిగంటలు ర్యాలీలో పాల్గొనటం సాధ్యమేనా ?





జరిగింది చూసిన అందరికీ అనారోగ్యాలన్నది చంద్రబాబు  అండ్ కో ఆడిన డ్రామాలా అనే సందేహం పెరిగిపోతోంది. తనను రిసీవ్ చేసుకోవటానికి వచ్చిన కుటుంబసభ్యులతో పాటు సీనియర్ నేతలతో కూడా చంద్రబాబు ఎంతో ఉత్సాహంతో మాట్లాడారు. సీఐడీ విచారణలో అర్ధగంట కూడా కూర్చోలేనని చెప్పిన చంద్రబాబు ఇపుడు మాత్రం గంటల తరబడి కారులో ఎలాగ  కూర్చున్నారు ? మధ్యంతర బెయిల్ విషయంలో  హైకోర్టు విధించిన షరతులను జైలు బయటే ఉల్లంఘించారు. అందుకనే అనారోగ్యం నిజమేనా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: