జనసేన విస్తృతస్ధాయి సమావేశంలో అధినేత పవన్ కల్యాణ్ తన ఫెయిల్యూర్ ను అంగీకరించారు. ఇంతకీ ఆ ఫెయిల్యూర్ ఏమిటంటే ఎలక్షనీరింగ్ చేయలేకపోవటం. ఎన్నికల్లో గెలవాలంటే ఎలక్షనీరింగ్ చేసుకోవటం చాలా ముఖ్యమన్నారు. సభలు పెట్టినా, ర్యాలీలు,  రోడ్డుషోలు నిర్వహిస్తే లక్షలాది జనాలు వస్తారన్నది నిజమే అన్నారు. అయితే సభలకు, ర్యాలీలకు హాజరైన జనాలందరు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓట్లేస్తారని అనుకోవటం తప్పన్నారు. ఎవరేమి చేసినా పోలింగ్ రోజున జనాలను పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చి ఓట్లేయించేంత యంత్రాంగం చాలా అవసరమన్నారు.

జనాలను పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చి ఓట్లు వేయించుకునే  ఎలక్షనీరింగ్ జనసేనకు లేదని పవన్ అంగీకరించారు. ఈ ఎలక్షనీరింగ్ చేయగలదనే, అవసరమైన యంత్రాంగం ఉందనే తెలుగుదేశంపార్టీతో కలిసినట్లు చెప్పారు. ఈ ఎలక్షనీరింగ్ లేకపోవటం వల్లే 2019లో ఘోరంగా ఓడిపోయిన విషయాన్ని అంగీకరించారు. పార్టీ సమావేశంలో పవన్ చాలా విషయాలు ప్రస్తావించారు. అయితే అందులో తనను తాను చాలా ఎక్కువగా ప్రొజెక్టు చేసుకోవటంతోనే సరిపోయింది. తన భావజాలాన్ని నరేంద్రమోడీ, అమిత్ షా, జేపీ నడ్డా, చంద్రబాబునాయుడు అర్ధంచేసుకున్నపుడు పార్టీలోని కొందరు నేతలు ఎందుకు అర్ధంచేసుకోవటంలేదని ప్రశ్నించారు.

రాబోయే ఎన్నికల్లో జనసేన ఒంటిరిగానే పోటీచేయాలని కొందరు నేతలు కోరుకుంటున్నారన్న విషయం తెలుసన్నారు. ఒంటరిగా పోటీచేయటానికి తాను సిద్ధంగా ఉన్నానని అయితే జగన్ మహాత్మాగాంధి, సుభాష్ చంద్రబోస్, స్వామి వివేకానంద లాంటి ఐడియాలజి ఉన్న వ్యక్తి కాదన్నారు. ఐడియాలజీ కోసం కాకుండా జగన్ అధికారం కోసమే రాజకీయాలు చేస్తున్నపుడు తాము కూడా అదే పద్దతిలో పోవాలన్నారు. ప్రతిపక్షాలను జగన్ చావగొడుతున్నపుడు మనం ఒంటరిగా పోరాటం చేస్తామంటే కుదరదని చెప్పారు.

వైసీపీ కెపాసిటిని తక్కువగా అంచనా వేస్తే  ఇబ్బంది పడటం ఖాయమని హెచ్చరించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదన్న కారణంతోనే టీడీపీతో కలిసినట్లు చెప్పారు. జనసేనలో ఉంటూ టీడీపీతో పొత్తును వ్యతిరేకిస్తున్న వాళ్ళందరినీ తాను వైసీపీ కోవర్టులుగానే చూస్తానని ప్రకటించారు. కాబట్టి తన ఐడియాలజీని అర్ధంచేసుకుని  తనకు మద్దతుగా నిలబడాలని కోరారు. రాబోయేది టీడీపీ-జనసేన ప్రభుత్వమే అని చెప్పారు. ఏపీ భవిష్యత్తును నిర్ణయించబోయేది జనసేనే అని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: