
లోకేష్ చేస్తున్న యువగళం పాదయాత్ర ఈనెల 17వ తేదీన ముగుస్తోంది. కుప్పంలో మొదలైన పాదయాత్ర ఒరిజినల్ గా అయితే శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురంలో ముగియాలి. అయితే తూర్పుగోదావరి జిల్లా రాజోలులో పాదయాత్ర జరుగుతుండగా చంద్రబాబునాయుడును సీఐడీ సెప్టెంబర్ 9వ తేదీన అరెస్టుచేసిన విషయం తెలిసిందే. దాంతో పాదయాత్రకు లోకేష్ బ్రేక్ ఇచ్చారు. చివరకు చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ వచ్చేంతవరకు మళ్ళీ పాదయాత్ర ఆలోచన చేయలేదు. దాంతో రెండు మాసాలు పాదయాత్ర నిలిచిపోయింది.
అప్పుడు నిలిచిపోయిన పాదయాత్ర నవంబర్ 27వ తేదీన పునఃప్రారంభమైంది. ఆ పాదయాత్రనే విశాఖపట్నం జిల్లాలోని భీమిలీ నియోజకవర్గంలో లోకేష్ ముగించేయబోతున్నారు. పాదయాత్ర ముగింపు సందర్భంగా భారీ బహిరంగసభ నిర్వహిస్తున్నారు. ఆ సభకు చంద్రబాబుతో పాటు మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరవుతున్నట్లు పార్టీవర్గాలు చెప్పాయి. ఒరిజినల్ ప్లాన్ ప్రకారం 400 రోజులు, 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర జరగాలి. చంద్రబాబు అరెస్టుతో ప్లాన్ మొత్తం మారిపోయింది.
పాదయాత్ర ఈనెల 6వ తేదీన అనకాపల్లి జిల్లాలోని పాయకరావుపేట నియోజకవర్గానికి చేరుకుంటుంది. అక్కడి నుండి పాదయాత్రతో పాటు రోడ్డుషోలు ఎక్కువగా చేస్తారట. ఇలా పాదయాత్ర కమ్ రోడ్డుషోలు చేసుకుంటు భీమిలీ నియోజకవర్గానికి చేరుకుంటారు. చివరగా 17వ తేదీన బహిరంగసభ నిర్వహించబోతున్నారు. భారీ బహిరంగసభ నిర్వహణకు నేతలు అన్నీ రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. టీడీపీ నేతలతో పాటు జనసేన నేతలు, క్యాడర్ కూడా విస్తృతంగా పాల్గొంటున్నట్లు సమాచారం. మామూలుగానే ఉత్తరాంధ్రలో టీడీపీకి పట్టుంది. అలాంటిది ఇపుడు జనసేన కూడా తోడవ్వటంతో తమ్ముళ్ళల్లో మంచి జోష్ కనబడుతోంది.
అందుకనే భీమిలీ నియోజకవర్గంలో జరగబోయే బహిరంగసభ రెండుపార్టీల ఆధ్వర్యంలో జరగబోయే మొదటి బహిరంగసభ అనుకోవచ్చు. అందుకనే రెండుపార్టీల నేతలు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నారు. కాకపోతే బహిరంగసభ తర్వాత రెండుపార్టీల నేతల సఖ్యత ఎలాగుంటుందో అనుమానంగా ఉంది. ఎందుకంటే భీమిలి నియోజకవర్గంలో పోటీచేయటానికి రెండుపార్టీల నేతలు ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు. నియోజకవర్గంలో రెండుపార్టీల నేతలు గట్టిగానే తిరుగుతున్నారు. కాబట్టి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.