దిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, సీఎం కేజ్రీవాల్ అరెస్టై తిహాడ్ జైలు జీవితం గడుపుతున్నారు. తాజాగా ఆయన  షుగర్ లెవల్స్ పెంచుకునేందుకు మామిడి పండ్లను తీసుకుంటున్నారని ఈడీ అధికారులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఇది సంచలనంగా మారింది. కేజ్రీవాల్ అరెస్ట్ కు నిరసనగా ఇండియా కూటమి నేతలు రాంచీలో ఉల్గులన్ న్యాయ్ ర్యాలీ నిర్వహించారు.


ఈ సభకు హాజరైన కేజ్రీవాల్ సతీమణి సునీత పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కక్షా రాజకీయాలు పరాకాష్టకు చేరాయని మండి పడ్డారు. తన భర్తను జైలులోనే చంపేసేలా ఉన్నారని తీవ్రస్థాయిలో ఆరోపించారు. జైలులో ఇన్సులిన్ అందకుండా చేసి చంపేందుకు కుట్రలు జరుగుతున్నాయన్నారు. ఆయన్ను లేకుండా చేసేందుకు కేంద్రం యత్నిస్తోందని.. ఇప్పుడు అదును కోసం చూస్తోందని పేర్కొన్నారు. బీజేపీ నియంతృత్వానికి వ్యతిరేకంగా ఇండియా కూటమి పోరాటం సాగిస్తుందని.. ఈ క్రమంలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.


తీహాడ్ జైలులో తన భర్త కేజ్రీవాల్ పరిస్థితి దుర్భరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడనే ఏదో విధంగా చనిపోయేలా చేసేందుకు పావులు కదుపుతున్నారని విమర్శించారు. ఇన్సూలిన్ ఇవ్వడం లేదు. తీసుకునే ఆహారంపై సీసీ టీవీతో నిఘా పెట్టారని అన్నారు. తన భర్తకు షుగర్ ఉందని.. 12 ఏళ్లుగా ఇన్సులిన్ తోనే చికిత్స సాగుతుందన, రోజుకు కనీసం 50 యూనిట్ల వరకు ఇది కావాల్సిందే అన్నారు.


అయితే దీనిని నిరాకరించడం ద్వారా ఏమి చేద్దామనుకుంటున్నారని ప్రశ్నించారు. దిల్లీ సీఎం, ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ లను దోషులుగా నిరూపించకుండానే జైల్లో పెట్టడం నియంతృత్వాన్ని తలపిస్తోందని విమర్శించారు. తన భర్త చేసిన తప్పేంటని.. మెరుగైన విద్య, వైద్య సౌకర్యాలు కల్పించడమే ఆయన చేసిన తప్పా అని ప్రశ్నించారు. ప్రజాసేవకు అంకిత భావంతో ముందుకు కదిలినందుకు జైలు పాలు చేశారని అన్నారు. ఆయనపై మోపిన అభియోగాలు ఏవీ కూడా రుజువు కాలేదని వివరించారు. త్వరలోనే జైలు గోడలు బద్దలై బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: