ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఆరు రోజులు మాత్రమే మిగిలి వున్నది. దాంతో విపక్షాలు ఒకరిపై ఒకరు మాటలు తూటాలు విసురుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఏపీలో వేడి పుట్టిస్తున్న అంశం 'ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు.' ఇదే అంశాన్ని పట్టుకున్న టీడీపీ, అధికార పార్టీ అధినేత జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. భూముల అక్రమ మార్పిడితో వైఎస్‌ఆర్‌ జిల్లా ఒంటిమిట్ట అట్టుడుకుతోందని తాజాగా జరిగిన యువగళం ప్రచార కార్యక్రమాల్లో టీడీపీ యువ నాయకుడు లోకేష్ జగన్ పైన మండిపడ్డారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌ జిల్లా ఒంటిమిట్ట మండలంలో జరిగిన ఓ విషయాన్ని చెప్పుకొచ్చారు. విషయం ఏమిటంటే? ఒంటిమిట్ట మండల పరిధిలో గల కొత్త మాధవరానికి చెందిన సుబ్బారావుకు 3.10 ఎకరాలుంది. అయితే ఒకనాడు కుటుంబ సభ్యులకు అనారోగ్య కారణాలతో వైద్య ఖర్చులకు వారు అప్పులు చేయడం జరిగింది. దాంతో అప్పుల్ని తీర్చడానికి ఉన్న పొలాన్ని విక్రయించడానికి బేరం పెట్టారు. ఇక వ్యవహారం చివర దశలో ఉండగా కొనుగోలుదారు భూముల వివరాలు పరిశీలించగా అవి సుబ్బారావు పేరిట లేదని తేటతెల్లం అయింది. దాంతో తనకు తెలియకుండా భూముల బదలాయింపుపై రెవెన్యూ అధికారులను కలిసి పోరాటం సాగించి అలిసిపోయారు. ఈ క్రమంలో చివరకు గ్రామ సమీపంలోని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. భర్త చనిపోయాడన్న విషయం తెలిసిన భార్య, కుమార్తె సైతం ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడడం రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసినదే.

ఇలాంటిదే మరోకథ... కడప నగర సమీపంలో సీకేదిన్నె మండలం, మామిళ్లపల్లె గ్రామానికి చెందిన రామ్మోహన్‌ రెడ్డికి సుమారుగా 5 ఎకరాలు భూమి ఉంది. భూములపై బ్యాంకు రుణాలు సైతం ఏళ్ల తరబడి తీసుకోవడం జరిగింది. ఆ భూములపై సర్వ హక్కులు ఉన్నప్పటికీ పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తి ఇటీవల వేరే వ్యక్తుల పేరుతో ఆన్‌లైన్‌లో నమోదైంది. దీనిపై ఆ కుటుంబ సభ్యులు ఇంకా న్యాయ పోరాటం చేయడం కొసమెరుపు. ఇదే విషయాలను చెబుతూ టీడీపీ నాయకుడు యువగళం సభలో జగన్ పైన నిప్పులు చెరిగారు.

మరింత సమాచారం తెలుసుకోండి: