
కేసీఆర్ రీ-ఎంట్రీ
ఈ భారీ సభకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు (కేసీఆర్) నాయకత్వం వహించనున్నారు. ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయి, ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కేసీఆర్ హాజరవుతున్న మొట్టమొదటి అతిపెద్ద బహిరంగ సభ ఇదే కావడం విశేషం. ఆయన ప్రసంగం పార్టీ కార్యకర్తల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతుందని, పార్టీ భవిష్యత్ కార్యాచరణ ఏంటో వివరిస్తుందని రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
రికార్డు స్థాయిలో ఏర్పాట్లు
ఈ మెగా ఈవెంట్ కోసం బీఆర్ఎస్ పార్టీ ఎక్కడా తగ్గకుండా భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఏకంగా 1,213 ఎకరాల విశాలమైన స్థలాన్ని సభ కోసం సిద్ధం చేశారు. ఇందులో ప్రధాన సభా వేదిక, ముఖ్య అతిథుల కోసం ఏకంగా 154 ఎకరాలు కేటాయించారు. ఈ వేదికపై సుమారు 500 మంది ముఖ్య నేతలు ఆసీనులయ్యేలా ఏర్పాట్లు చేశారు. ఇక సభకు వచ్చే వాహనాల కోసం, మిగిలిన 1,059 ఎకరాలను పార్కింగ్ స్థలంగా మార్చారు.
ప్రజల సౌకర్యం కోసం అన్నీ సిద్ధం
సభకు హాజరయ్యే లక్షలాది మంది ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పార్టీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. దాదాపు 10 లక్షల మంచినీటి బాటిళ్లు, ఎండ వేడి నుంచి ఉపశమనానికి 16 లక్షల మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేయనున్నారు. అత్యవసర వైద్య సేవలు అవసరమైతే వెంటనే స్పందించేందుకు, సభా ప్రాంగణానికి వచ్చే వివిధ రూట్లలో 6 అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచారు. అలాగే, ప్రజల సౌకర్యార్థం సుమారు 1,200 తాత్కాలిక మరుగుదొడ్లను కూడా ఏర్పాటు చేశారు.
పార్కింగ్ దగ్గర నుంచి సభా ప్రాంగణం వరకు ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు, మార్గనిర్దేశం చేసేందుకు ఏకంగా 2,000 మంది వాలంటీర్లను నియమించారు. వీరంతా ప్రజల రాకపోకలు సజావుగా సాగేలా, అందరి భద్రతను పర్యవేక్షిస్తూ సభ విజయవంతం అయ్యేందుకు కృషి చేస్తారు.
• పుర్వవైభవం కోసం బీఆర్ఎస్ ఆశలు:
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా 2001లో బీఆర్ఎస్ పార్టీ (అప్పటి టీఆర్ఎస్) ఆవిర్భవించింది. ఆ లక్ష్యాన్ని చేరుకుని, తెలంగాణను సాధించడమే కాకుండా రెండు పర్యాయాలు ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసింది. అయితే, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా అధికారాన్ని కోల్పోయింది. ఈ నేపథ్యంలో, ఎల్కతుర్తిలో జరగనున్న ఈ సిల్వర్ జూబ్లీ సభను పార్టీకి ఒక నూతన అధ్యాయంగా, తెలంగాణ రాజకీయాల్లో తిరిగి తమ పూర్వ వైభవాన్ని సాధించే దిశగా ఒక కీలక అడుగుగా బీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి.