ఇప్పటికే ఇంటి పన్నులు, కరెంట్ బిల్లులతో జనం నడ్డి విరుగుతుంటే, చంద్రబాబు సర్కారు ఇప్పుడు మరో పిడుగులాంటి నిర్ణయంతో ప్రజలపైకి దూసుకొస్తోంది. రిజిస్ట్రేషన్ల శాఖలో అణువణువూ పిండేసి, ఖజానా నింపుకోవాలనే నయా ఎత్తుగడకు పదును పెడుతున్నట్టు స్పష్టమవుతోంది. ఇది సంపద సృష్టి పేరిట సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టే కార్యక్రమమేనని జనం గుసగుసలాడుకుంటున్నారు.

ఆస్తుల రిజిస్ట్రేషన్లపై ఇప్పటికే ఓ దఫా వడ్డించిన ప్రభుత్వం, ఇప్పుడు ఆ చార్జీల మోతను మరింత పెంచేందుకు కసరత్తు చేస్తోంది. కేవలం భూములు, ఇళ్ల రిజిస్ట్రేషన్లే కాదు, పెళ్లిళ్లు మొదలుకొని చివరకు విడాకుల పత్రాల వరకు దేన్నీ వదిలేలా లేదు ఈ నయా వసూళ్ల పర్వం. స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ పరిధిలోని సుమారు 56 రకాల సేవలపై ఈ 'బాదుడు' ప్రభావం పడనుంది. కొన్నింటికి నామమాత్రంగా ఉన్న రుసుములను మార్కెట్ విలువలతో ముడిపెట్టి, మరికొన్నింటిని హేతుబద్ధీకరణ పేరుతో ఒకే గాటన కట్టి భారీగా దండుకునేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని విశ్వసనీయ సమాచారం.

నిజానికి, 1972 నాటి కాలం చెల్లిన చార్జీలనే చాలాకాలంగా వసూలు చేస్తున్నారని, 2013లో కొన్నింటిని సవరించినా, ఇంకా చాలా సేవలు నామమాత్రపు ధరలకే అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం ఓ కథ అల్లుతోంది. ఈ క్రమంలోనే, షెడ్యూల్ 1ఏ కింద ఉన్న వివిధ రకాల దస్తావేజులను పునర్‌వర్గీకరించి, ఒకే తరహా సేవలకు ఒకే రేటు ఫిక్స్ చేసేలా కసరత్తు ముమ్మరం చేశారు.

నమ్మశక్యం కాని విషయమేమిటంటే, ఇప్పటిదాకా విడాకుల పత్రాలు, అఫిడవిట్లు, దస్తావేజుల రద్దు వంటి వాటికి కేవలం ఐదారు రూపాయల నామమాత్రపు స్టాంప్ డ్యూటీ మాత్రమే ఉండేది. ఇకపై వీటిపైనా కనికరం లేకుండా చార్జీల మోత మోగించనున్నారట. ప్రభుత్వ ఖజానా నింపడమే లక్ష్యంగా, 'సంపద సృష్టి' అనే అందమైన పేరుతో ఈ భారాల మోతకు సర్కారు సిద్ధమైందని తెలుస్తోంది. అంటే, సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టి ఖజానా నింపుకోవడమే ఈ కొత్త ఆర్థిక సూత్రం అన్నమాట.

ఈ దెబ్బతో సగటు మనిషికి రిజిస్ట్రేషన్ కార్యాలయమంటేనే గుండెల్లో రైళ్లు పరిగెత్తే పరిస్థితి రాబోతోందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి, ఈ 'సంపద సృష్టి' యజ్ఞంలో సామాన్యుడు ఇంకెన్ని ఆహుతులివ్వాలో.

మరింత సమాచారం తెలుసుకోండి: