
భారతదేశం వంటి బాధ్యతాయుతమైన దేశం, అనవసరపు ఆర్భాటాలకు పోదు. పక్కనున్న చైనాను భస్మం చేస్తామనో, పాకిస్థాన్‌ను ఆక్రమించుకుంటామనో ప్రగల్భాలు పలకదు. ఎందుకంటే వాస్తవికతకు, దేశభక్తికి మధ్య ఉన్న తేడా భారత్‌కు తెలుసు. ఈ ఆధునిక యుగంలో ఒక దేశాన్ని పూర్తిగా ఆక్రమించుకోవడం అసాధ్యమని చరిత్ర పదే పదే రుజువు చేస్తోంది. అగ్రరాజ్యం అమెరికా ఆఫ్ఘనిస్థాన్‌లోనూ, సైనిక శక్తి రష్యా ఉక్రెయిన్‌లోనూ ఎదుర్కొన్న సవాళ్లే ఇందుకు నిలువెత్తు నిదర్శనం. కోట్లాది డాలర్లు కుమ్మరించినా, వేల సైన్యాన్ని మోహరించినా చివరికి మిగిలింది శూన్యం. స్థానిక ప్రజల మనసులను గెలవలేనప్పుడు, ఆ భూమిని శాసించడం అసాధ్యం. అంతటి దరిద్రపుగొట్టు, అస్థిరమైన పాకిస్థాన్‌ను ఆక్రమించుకోవాలనే ఆలోచన చేయడం కూడా అవివేకమే.
ఇంత గొప్పలు చెబుతున్న పాకిస్థాన్ గతాన్ని ఒక్కసారి గుర్తుచేసుకోవాలి. ఇటీవలే భారత్ ధాటికి తట్టుకోలేక, ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబడింది. చివరికి తన పరువు కాపాడుకోవడం కోసం, శాంతి చర్చలకై సౌదీ అరేబియా కాళ్లావేళ్లా పడిన వైనం ఇంకా కళ్లముందే కదలాడుతోంది. భారత్ దెబ్బకు తోకముడిచిన దేశం, ఇప్పుడు ఏకంగా అణ్వస్త్రాలను ధ్వంసం చేస్తామని గర్జించడం హాస్యాస్పదం. ఇది కేవలం తమ దేశ ప్రజల దృష్టిని మరల్చే ఎత్తుగడ తప్ప మరొకటి కాదు. ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరత, ఉగ్రవాద భూతంతో కునారిల్లుతున్న తమ దేశ ప్రజలకు, దేశభక్తి అనే మత్తుమందు ఇచ్చి మభ్యపెట్టే ప్రయత్నమే ఈ వింత ప్రకటనలు.
పాకిస్థాన్ మీడియాలో వినిపిస్తున్న ఈ గొప్పలు, కేవలం వారి బలహీనతను కప్పిపుచ్చుకోవడానికి వేస్తున్న ముసుగు మాత్రమే. భారత్‌పైకి దాడికి రావాలనే ఆలోచన కూడా చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నవారు, ఇలాంటి గాలి మాటలతో కాలం గడుపుతున్నారు. వారి అరుపులకు ఇక్కడ ఎవరూ భయపడరు. భారతదేశం తన సత్తా ఏంటో చేతల్లో చూపిస్తుంది కానీ, ఇలాంటి చౌకబారు ప్రకటనలతో తన స్థాయిని తగ్గించుకోదు. వారిది కోతల హోరు.. మనది వాస్తవాల జోరు. అంతే తేడా.