
ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం ... రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్ లాంటి బీజేపీ దిగ్గజాల పేర్లు ఉపరాష్ట్రపతిగా పరిగణనలో ఉన్నాయంటూ లీకులు వెలువడుతున్నాయి. అయితే వీరిలో ఎవరైనా అటువైపు వెళ్తే, వారికి ఉన్న కీలక కేబినెట్ పదవులు ఖాళీ అవుతాయి. దాంతో మరోమారు మంత్రుల జాబితాలో భారీ మార్పులే చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈసారి మార్పుల్లో ఆర్‌ఎస్‌ఎస్ భుజం బలంగా కనిపించనుంది. మోదీ – షా ద్వయం ఆర్‌ఎస్‌ఎస్ సూచనలకు ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నట్టు వినిపిస్తోంది. అందుకే ఈ మార్పులు సాధారణ మార్పులు కావు… భారీ రాజకీయం దాగి ఉంది.
తెలుగురాష్ట్రాల విషయంలోనూ మోదీ గేమ్ ప్లాన్ ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటికే టీడీపీతో కలిసి పాలన సాగిస్తున్న కేంద్రం, టీడీపీకి మరో సహాయ మంత్రి పదవి ఇవ్వనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా, కేంద్ర మంత్రి పదవి వద్దని బండి సంజయ్ చెప్పినట్టు సమాచారం. తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే తన ఫోకస్ అని చెప్పిన సంజయ్ స్థానంలో జి.కిషన్ రెడ్డి సన్నిహితుడు లక్ష్మణ్‌కు అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. మొత్తానికి కేంద్రంలో రాజాకీయం మారనుంది. పదవుల పంచాయితీ, ఎన్నికల ఎత్తుగడలు అన్నీ కలిసి రాజకీయ మాస్టర్ స్ట్రోక్ దిశగా నడుస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది.