
రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. కాలం, పరిస్థితులు, నాయకుల తీరు, పార్టీల వ్యూహాలు ఇవన్నీ మారుతుంటాయి. ఒక నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం ఎలా ఉండాలో అక్కడి నాయకుల ఉనికి, వారి పని తీరు నిర్ణయిస్తాయి. కొన్నిచోట్ల నాయకుల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల రాజకీయాలు ఉత్సాహంగా సాగుతుంటే, మరికొన్ని నియోజకవర్గాల్లో మాత్రం అన్ని పార్టీల్లోనూ నాయకుల కొరత స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సమస్య ఒక్క ప్రతిపక్షం వైసీపీకి మాత్రమే కాదు, అధికార పార్టీ టీడీపీకి కూడా ఉంది. గత ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిన కొన్ని స్థానాల్లో కూడా ఇప్పుడు పరిస్థితులు మారాయి. రాబోయే ఎన్నికల్లో విజయం సాధించాలంటే ఇప్పటి నుంచే వ్యూహాత్మక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. చివరి క్షణంలో కాకుండా ముందుగానే మార్పులు చేస్తే, అభ్యర్థుల ఎంపికలో స్పష్టత వస్తుందని ఆయన భావిస్తున్నారు.
ఈ క్రమంలో, వచ్చే ఎన్నికల నాటికి కొందరు ప్రస్తుత ఎమ్మెల్యేలు తప్పుకోబోతున్నారని టాక్ ? ఉదాహరణకు, రాజమండ్రి రూరల్ నియోజకవర్గం. గత ఎన్నికల్లో బుచ్చయ్య చౌదరి ఈ సీటు గెలిచారు. ఆయన వివాదరహితుడు అయినా వయసు కారణంగా వచ్చే ఎన్నికల నాటికి ఆయనకు టికెట్ ఇవ్వకపోవచ్చని, ఆ సీటు జనసేనకు కేటాయించే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. ఇక చిత్తూరు జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే మాత్రం వివాదాల్లో ఇరుక్కొన్నారు. ఎమ్మెల్యే ఉన్నప్పటికీ, పార్టీ స్థానిక బాధ్యతలను ఇతర నాయకులకు అప్పగించింది. దీంతో ఆయన కొనసాగినా, లేకపోయినా, అభ్యర్థి మార్పు దాదాపు ఖాయమని చెబుతున్నారు.
మరోవైపు, కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం నాయకులు లెక్కకు మిక్కిలిగా ఉన్నారు. మైలవరం వంటి ప్రాంతాలు ఈ జాబితాలో ఉన్నాయి. గత ఎన్నికల్లో టికెట్లు వదులుకున్న నాయకులు, తిరిగి అవకాశం కోసం ప్రయత్నిస్తున్నారు. 2029 నాటికి నియోజకవర్గాల సంఖ్య పెరిగితే ఈ సమస్య కొంతవరకు తీరొచ్చు. కానీ పెరగకపోతే, మళ్లీ టికెట్ కోసం పార్టీ లోపల గట్టి పోటీ తప్పదని, ఇది పార్టీలకు తలనొప్పిగా మారవచ్చని అంటున్నారు. మొత్తం మీద, చంద్రబాబు చేపడుతున్న ఈ వ్యూహాత్మక మార్పులు రాబోయే ఎన్నికల ఫలితాల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు