
పార్టీకి దశాబ్దాలుగా సేవలందించిన పలువురు సీనియర్ నాయకులు ఈ పదవికి ఆసక్తి చూపుతున్నా, అధిష్టానం మాత్రం నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈలోగా ఎమ్మెల్యే ఈశ్వరరావు ఎచ్చెర్లలో బలంగా పాతుకుపోయే ప్రయత్నాలు చేస్తున్నారు. కళా వెంకట్రావు కుమారుడు రాం మల్లిక్ నాయుడు, మరో ఇద్దరు నాయకులు కూడా ఈ పదవికి పోటీ పడుతున్నా, పార్టీ పెద్దలు స్పందించకపోవడం వల్ల స్థానిక టిడిపి కార్యకర్తలు నిరుత్సాహంలో ఉన్నారు.
గతంలో టిక్కెట్ విషయంలో కళా వెంకట్రావు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వర్గాల మధ్య తీవ్ర విభేదాలు జరిగాయి. ప్రస్తుతం ఈ ఇద్దరూ నియోజకవర్గ కార్యకర్తలకు అందుబాటులో లేని పరిస్థితి. కళా వెంకట్రావు చీపురుపల్లి ఎమ్మెల్యేగా ఉండటంతో అక్కడే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. కలిశెట్టి అప్పలనాయుడు ఎంపీ అయిన తర్వాత ఢిల్లీ లేదా విజయనగరంలోనే ఎక్కువగా ఉంటున్నారు. దీంతో ఎచ్చెర్ల టిడిపి నేతలు, కార్యకర్తలు పనుల కోసం బిజెపి ఎమ్మెల్యే చుట్టూ తిరగాల్సి వస్తోంది.
ఎన్నికల సమయంలో కూటమి అభ్యర్థిగా ఈశ్వరరావు గెలవడానికి సహకరించిన టిడిపి కార్యకర్తలు, ఇప్పుడు ఆయన తమను పట్టించుకోవడంలేదని భావిస్తున్నారు. ఇక్కడ తక్షణమే టిడిపి ఇన్‌ఛార్జి నియమిస్తే పార్టీ తిరిగి బలపడుతుందని, లేకపోతే పరిస్థితి మరింత దిగజారుతుందని అభిప్రాయపడుతున్నారు. ఈశ్వరరావు, టిడిపిలోని రెండు గ్రూపుల విభేదాలను తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారని, ముఖ్యంగా కళా వెంకట్రావు వర్గానికి ప్రాధాన్యత ఇస్తూ, కలిశెట్టి టీంతో దూరం పెంచుతున్నారని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. మరి చంద్రబాబు ఎచ్చెర్లకు టీడీపీ ఇన్‌చార్జ్‌గా ఎవరిని నియమిస్తారో ? చూడాలి.