విశాఖ ఉక్కు పరిశ్రమ అంశం మరోసారి పెద్ద వివాదానికి కేంద్రబిందువైంది. ఈ ప్లాంట్‌ను ప్రైవేటీకరించకుండా కాపాడాలని గత మూడేళ్లుగా కార్మికులు, కార్మిక సంఘాలు తీవ్రంగా ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. కానీ వారు చేసిన పోరాటం, నిరసనలన్నీ ఇప్పటివరకు స‌క్సెస్ కాలేదు. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రైవేటీకరణ అంశాన్ని ముందుకు తీసుకువస్తూనే ఉండటంతో కార్మిక వర్గాల్లో ఆందోళన మరింత పెరుగుతోంది. తాజాగా కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం, విశాఖ స్టీల్ ప్లాంట్‌లోని ఏకంగా 34 విభాగాలను ప్రైవేటు చేతులకు అప్పగించే నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను విశాఖ ఉక్కు అధికారులు కూడా జారీ చేయడం పెద్ద షాక్ ఇచ్చింది. ఇందులో ముఖ్యమైన గనులు కూడా ఉండటం ప్రత్యేక ఆందోళనకు కారణమైంది. ఎందుకంటే గనులు లేకుండా ఉక్కు పరిశ్రమ నడవడం సాధ్యం కాదు. గనులపైనే ఆధారపడి విశాఖ ఉక్కు భవిష్యత్తు ఉంటుంది. దశాబ్దాలుగా కార్మికులు గనులను కాపాడుకోవడానికి పోరాటం చేస్తున్నారు.


ఇంకా ముఖ్యంగా, బ్లాస్ట్ ఫర్నేస్‌-1, 2, 3లను కూడా ప్రైవేటీకరణ జాబితాలో చేర్చారు. ఇవి విశాఖ ఉక్కు పరిశ్రమకు వెన్నెముక వంటివి. ఇవి ప్రైవేటు చేతుల్లోకి వెళితే, పరిశ్రమ భవిష్యత్తు పూర్తిగా ప్రశ్నార్థకంగా మారిపోతుందని కార్మిక సంఘాలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. "ప్రైవేటీకరణ చేయమని అంటూనే ఒకవైపు ఇలాంటి నోటిఫికేషన్లు ఎందుకు జారీ చేస్తున్నారు?" అని వారు నిలదీయడం ప్రారంభించారు. ఈ పరిణామాలు కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా మంత్రి నారా లోకేష్‌కు, స్థానిక ఎంపీ భరత్‌కు కూడా పెద్ద ఇబ్బందిగా మారాయి. లోకేష్ ఢిల్లీ పర్యటనలో ఉన్న వేళ, కార్మిక సంఘాలు ఈ సమస్యను తక్షణమే ప్రస్తావించాలని డిమాండ్ చేస్తున్నాయి. నిజంగా ప్రైవేటీకరణ చేయాలనుకుంటే బహిరంగంగా చెప్పాలని, దాచిపెట్టకుండా స్పష్టత ఇవ్వాలని వారు అంటున్నారు.


ఇక మరోవైపు, ఈ అంశం ఇప్పటికే హైకోర్టులో విచారణలో ఉంది. ఈ ఏడాది నవంబరులో మళ్లీ విచారణ జరగనుంది. హైకోర్టు విచారణ కొనసాగుతున్న సమయంలోనే ప్రైవేటీకరణకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం సరైన పద్ధతి కాదని కార్మికులు స్పష్టం చేస్తున్నారు. ఇది చట్టపరమైన సమస్యలకు కూడా దారి తీసే అవకాశం ఉందని వారి వాదన. మొత్తం మీద, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. కార్మికుల నిరసనలు, రాజకీయ పార్టీల ఒత్తిడి, కోర్టు విచారణ ఇవ‌న్నీ కలిపి రాబోయే రోజుల్లో పరిస్థితిని మరింత క్లిష్టతరం చేయనున్నాయి. విశాఖ ఉక్కు భవిష్యత్తు ఏ దిశలో సాగుతుందన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: