
"మీటింగుకు వస్తారు.. నోట్‌బుక్‌లో రాస్తారు.. ఆ తర్వాత పేపర్ల కట్టలా వేసేస్తారు. ఎవరికి ఉపయోగమూ లేదు" అని ఒక ఎమ్మెల్యే విసుగుతో అన్న మాటలు అక్కడి వాతావరణం ఎలా ఉందో చూపిస్తున్నాయి. ఇక మంత్రుల పరిస్థితి కూడా భిన్నంగా లేదు. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్, మంత్రి కొలుసు పార్థసారథి కూడా అధికారుల తీరు చూసి విస్మయపడ్డారు. "మంత్రి అడిగిన సమస్యనే పట్టించుకోవడం లేదంటే .. సాధారణ ఎమ్మెల్యేల స్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి" అని వారు బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. కొంతమంది అధికారులు తమ పనికి మించి రాజకీయ హోదాలు ఎక్కరన్నట్టుగా వ్యవహరిస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
దీంతో, ఏలూరు జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశాలు కేవలం ఒక రొటీన్‌గా మారిపోయాయి. అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టులు, అభివృద్ధి పనులు నిలిచిపోతున్నాయి. ప్రజల సమస్యలు పరిష్కారం కాక, అధికారుల పట్టింపులేని ధోరణి మరింత అసహనాన్ని రగల్చుతోంది. జనాల్లోనూ ఇప్పుడు ఒక ప్రశ్న గట్టిగా వినిపిస్తోంది – "ఎమ్మెల్యే, మంత్రి మాటే లెక్కలేకపోతే.. అధికారులను వశం చేసేది ఎవరు?". ఈ పరిస్థితి కొనసాగితే, ఏలూరు జిల్లా అభివృద్ధి కళ్లెం లేని గుర్రం లా మారిపోతుందని రాజకీయ విశ్లేషకుల అంచనా. మొత్తానికి.. అధికారుల నిర్లక్ష్యం, మంత్రుల హెచ్చరికలు, ఎమ్మెల్యేల అసహనం కలిసిపోవడంతో ఏలూరు జిల్లాలో ప్రజాప్రతినిధులు Vs అధికారులు అనే యుద్ధరంగం నెలకొంది. ఇంతకీ ఈ పోరులో గెలిచేది ఎవరో.. ఓడేది ఎవరో అన్నది కాలమే చెప్పాలి!