
తాజాగా సీఎం చంద్రబాబు దీనిపై నిర్ణయాత్మకంగా ముందుకు వెళ్లారు. ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు, తెలుగు భాషా ప్రియుడు మండలి వెంకట కృష్ణారావు పేరును తెలుగు అధికార భాషా సంఘానికి పెట్టాలని నిర్ణయించారు. ఈ ప్రతిపాదనను మంత్రి వర్గ సమావేశంలో ఉంచగా, ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. దీంతో తెలుగు అధికార భాషా సంఘానికి ఇకపై మండలి వెంకట కృష్ణారావు పేరు కొనసాగనుంది. మండలి కుమారుడు బుద్ధ ప్రసాద్ ప్రస్తుతం జనసేన ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో టీడీపీలోనూ, అంతకుముందు కాంగ్రెస్‌లోనూ మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకుంది. ఈ నేపథ్యం కూడా నిర్ణయానికి మరింత ప్రాధాన్యత తీసుకువచ్చింది. ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి చెందిన వెంకట కృష్ణారావు పేరును పెట్టడం పట్ల తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కాపు వర్గం పెద్ద ఎత్తున ఆనందం వ్యక్తం చేసింది. “ఇన్నాళ్లకు మండలికి తగిన గుర్తింపు వచ్చింది” అంటూ వ్యాఖ్యానాలు వెల్లువెత్తాయి. పలువురు ఆయన చిత్రపటాలకు పాలాభిషేకం చేసి తమ సంతోషాన్ని బయటపెట్టారు.
అయితే విమర్శకులు మాత్రం దీనిని రాజకీయ కోణంలో చూడకూడదని అంటున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని నిర్ణయంగానే చూడాలని, దానిని వర్గాలకే పరిమితం చేయడం సరికాదని కొందరు వాదిస్తున్నారు. తటస్థులు కూడా ఇది మంచి నిర్ణయం అని పేర్కొనడం విశేషం. ఏదేమైనా, తెలుగు భాషకు సేవలు చేసిన ఒక స్వాతంత్ర్య సమరయోధుడికి అధికార భాషా సంఘం పేరును ఇవ్వడం గర్వకారణమని చెప్పాలి. రాజకీయ కోణాలు పక్కన పెడితే, మండలి వెంకట కృష్ణారావుకు ఇది తగిన గుర్తింపు. అందుకే ఈ నిర్ణయం సర్వత్రా హర్షం పొందుతోంది. మొత్తానికి, ఇది భాషాభిమానులకు, కాపు సామాజిక వర్గానికి ఒకే సమయంలో ఆనందాన్నిచ్చిన నిర్ణయంగా నిలిచిపోతుంది.