దేశంలో ఇపుడు ఎన్నికలు జరిగితే మళ్లీ నరేంద్ర మోడీ ప్రధాని కుర్చీని కాపాడతారని ఇండియా టుడే – సీ ఓటర్ సర్వే సంచలన అంచనాలు వెల్లడించాయి. మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో నిర్వహించిన ఈ సర్వే ప్రకారం బీజేపీ తన బలం మరింత పెంచుకుని మళ్లీ ఏకపక్ష ఆధిపత్యం ప్రదర్శించబోతోందని ఈ సర్వే చెప్పబడుతోంది. ఈ సర్వే ప్రకారం, బీజేపీకి ఈసారి 260 ఎంపీ సీట్లు వస్తాయని అంచనా. అంటే 2024లో వచ్చిన 240 సీట్ల నుంచి మరో 20 సీట్లు ఎక్కువ అన్న మాట. ఇక ఎన్డీయే కూటమి మొత్తం 324 సీట్లు గెలుచుకుంటుందని, ప్రతిపక్ష ఇండియా కూటమి మాత్రం 208 సీట్ల దగ్గర ఆగిపోతుందని సర్వే చెబుతోంది. అంటే కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి మరోసారి వెనుకబడిపోతుందని స్పష్టమవుతోంది.


2024 తర్వాత వరుసగా మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే గెలవడం మోడీ మ్యాజిక్ మళ్లీ వర్కౌటైందని రుజువు చేసింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌తో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ బలం మరింత పెరిగిందని సర్వే చెబుతోంది. ఈ బలం ఆధారంగా ఇపుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే, మోడీ ఆధిపత్యం మరింత బలంగా ప్రదర్శించబడుతుందని అంచనా. 2024లో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమి 234 సీట్లు గెలిచి బీజేపీకి గట్టి సవాలు విసిరింది. అయితే ఇప్పుడు ఆ సంఖ్య 208కి తగ్గిపోవడం ప్రతిపక్షానికి పెద్ద దెబ్బగా మారనుంది. ఎన్డీయే ఓట్ల శాతం 46.7 శాతానికి పెరిగిందని, ఇది 2024లో వచ్చిన 44 శాతం కంటే ఎక్కువని సర్వే చెబుతోంది. మరోవైపు ఇండియా కూటమి ఓట్ల శాతం 40.9 శాతానికి పడిపోయిందని వెల్లడించింది.


సర్వే జూలై 1 నుంచి ఆగస్టు 14 వరకు జరిగింది. దేశంలోని అన్ని లోక్‌సభ స్థానాల్లో 54,788 మందిని నేరుగా ప్రశ్నించగా, అదనంగా 1,52,038 మంది ఇంటర్వ్యూలను కూడా విశ్లేషించారు. ప్రజల అభిప్రాయాల ఆధారంగా వచ్చిన ఈ అంచనాలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ అంచనాలు ఎంతవరకు నిజమవుతాయన్నది రాబోయే బీహార్ ఎన్నికల్లో తేలిపోతుంది. కానీ ఒకటి మాత్రం ఖాయం – ఈ సర్వే ప్రకారం ఇపుడు దేశంలో ఎన్నికలు జరిగితే మళ్లీ “మోడీ గాలి” దూసుకుపోతుంది. ప్రతిపక్షం వ్యూహాలు ఎంతగా కసరత్తు చేసినా, ప్రజా అభిప్రాయం మాత్రం మరోసారి మోడీదే పైచేయి అని చూపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: