అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ పేరు ఇటీవలి కాలంలో పార్టీ రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. గెలిచిన తర్వాత ఆయన శైలి, వ్యాఖ్యలు, నిర్ణయాలు ఎప్పటికప్పుడు వివాదాలకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలు పార్టీ శ్రేణుల్లోనే కాక, అభిమాన వర్గాల్లోనూ తీవ్ర అసంతృప్తి కలిగించాయి. అంతేకాక, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరితో ఆయనకు ఉన్న విభేదాలు కూడా స్థానికంగా పెద్ద సమస్యగా మారాయి. ఈ విభేదాలు పరిష్కారం కాకుండా మరింత ముదురుతున్నాయన్న ఫిర్యాదులు వినిపిస్తున్నాయి.


ఈ పరిస్థితుల్లోనే సీఎం చంద్రబాబు దగ్గుబాటిని పలు మార్లు హెచ్చరించినా తీరు మారిన‌ట్టు లేద‌ని టాక్ ? రెండు సార్లు పేషీ నుంచి నేరుగా సూచనలు వచ్చినా, ఆయన ప్రవర్తనలో పెద్దగా మార్పు కనబడలేదంటున్నారు. ఫలితంగా పార్టీ వర్గాల్లో చంద్రబాబు దగ్గుబాటిని పూర్తిగా పక్కనబెట్టారని చర్చ సాగుతోంది. దీనికి స్పష్టమైన ఉదాహరణగానే ఇటీవల జరిగిన "సూపర్ సిక్స్ – సూపర్ హిట్" భారీ బహిరంగ సభను చెప్ప‌వ‌చ్చు. ఈ కార్యక్రమం దగ్గుబాటి సొంత నియోజకవర్గంలోనే నిర్వహించారు. సహజంగానే ఇలాంటి ప్రాధాన్యత కలిగిన సభలో స్థానిక ఎమ్మెల్యేకు కీలక పాత్ర ఉండాలి. అన్నీ ఆయన ఆధ్వర్యంలో జరగాలి. ఉదాహరణకు ఈ ఏడాది కడపలో జరిగిన మహానాడులో స్థానికంగా మాధవీరెడ్డి భర్త శ్రీనివాసుల రెడ్డికి అన్ని కీల‌క బాధ్య‌తలు అప్ప‌గించారు. ఆయన పార్టీ తరఫున ప్రజల్లో చురుకుగా ఉండటం, ప్రతిపక్షంపై గట్టిగా స్పందించడం వంటివి పార్టీకి మేలు చేస్తున్నాయి.


దగ్గుబాటి విషయంలో అదే తరహా ప్రాధాన్యం ఇవ్వలేదు. సభ ఏర్పాట్ల నుంచి వేదికపైన వహించిన పాత్ర వరకూ ఆయనకు కేవలం నామమాత్రపు ప్రాధాన్యమే దక్కింది. చివర్లో కూడా చంద్రబాబు తన ప్రసంగంలో దగ్గుబాటి పేరు ప్రస్తావించకపోవడం గమనార్హం. ఇది ఆయనకు పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి వచ్చిన గట్టి వార్నింగ్ అని ప‌రిశీల‌కులు చెపుతున్నారు. దీనికి ప్రధాన కారణం ద‌గ్గుబాటి చుట్టూ ముసురుకుంటోన్న వ‌రుస‌ వివాదాలు, పార్టీ సీనియర్లతో తగాదాలు, కాంట్ర‌వ‌ర్సీ వ్యాఖ్య‌లు, ఆధిపత్య ధోరణి ప్రదర్శించడం వంటివేనని విశ్లేషకులు చెబుతున్నారు. ఏదేమైనా ద‌గ్గుబాటి స‌రిచేసుకోక‌పోతే ఆయ‌నకు ఫ్యూచ‌ర్ పాలిటిక్స్‌లో ఇబ్బందులు త‌ప్ప‌వు.

మరింత సమాచారం తెలుసుకోండి: