ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఇప్పుడు కీలకమైన స్థాయిలో ఉన్నారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనపై మరింత దృష్టి పడింది. ప్రత్యేకంగా తూర్పుగోదావరి జిల్లాలో, ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో ప్ర‌స్తుతం ప‌వ‌న్ ప‌రిస్థితి ఎలా ఉంది ? అన్న‌దానిపై స్థానికంగా ర‌క‌ర‌కాల చ‌ర్చ‌లు వినిపిస్తున్నాయి. పిఠాపురం నుంచి ఎన్నికైన పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ప‌వ‌న్ ఎమ్మెల్యేగా గెలిచిన యేడాది కాలానికే పిఠాపురం ప్రజల్లో కొన్ని వర్గాల అసంతృప్తి వినిపిస్తోంది. దీనికి ముఖ్య కారణం స్థానిక సమస్యల పరిష్కారం లో ఆలస్యం కావడమేనని భావిస్తున్నారు. ప్రజలు ముఖ్యంగా రహదారులు, తాగునీటి సమస్యలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదుపాయాల లోపం వంటి అంశాలను త‌ర‌చూ ప్ర‌స్తావిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న పవన్ కళ్యాణ్ వీటిపై మరింత వేగంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు.


కానీ ఆయనపై రాష్ట్రస్థాయి రాజకీయాలు, పాలనా బాధ్యతలు ఎక్కువగా ఉండటంతో నియోజకవర్గానికి తగిన సమయం కేటాయించడం కష్టమవుతోంది. ఈ కారణంగానే వ్యతిరేకత వాదనలు తెరమీదకు వస్తున్నాయి. పిఠాపురంలో కొంతమంది స్థానిక నేతలు తీరుపై కూడా ప‌వ‌న్ ప‌ట్ల అసంతృప్తికి కార‌ణ‌మ‌వుతోంది. ఈ అసంతృప్తి కారణంగా చిన్న చిన్న విభేదాలు బయటపడుతున్నాయి. రాజకీయ ప్రత్యర్థులు కూడా ఈ పరిస్థితిని ప్రయోజనంగా మలుచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మరోవైపు, పవన్ కళ్యాణ్ అభిమానం, క్రేజ్ పిఠాపురంలో ఇంకా బలంగానే కొనసాగుతోంది. ఆయన సింపుల్ లైఫ్‌స్టైల్, మాట నిలబెట్టుకోవాలన్న తపన, అవినీతి వ్యతిరేక వైఖరి వంటివి యువతలో విశ్వాసాన్ని పెంచుతున్నాయి.


పవన్ స్థానిక సమస్యలపై శ్రద్ధ పెట్టి త్వరితగతిన పరిష్కారానికి కృషి చేస్తే వ్యతిరేకత ఒక్కసారిగా తగ్గిపోవడం ఖాయం అని విశ్లేషకులు చెబుతున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌పై వ్యతిరేకత ఉందంటున్నా.. అది ప‌వ‌న్ వ‌ల్ల కాద‌నే వారు ఉన్నారు. ప‌వ‌న్‌ స్థానిక సమస్యలపై దృష్టి పెట్టడం, ప్రజలతో మరింత అనుబంధం కొనసాగించడం ద్వారా ఈ వ్యతిరేకతను మద్దతుగా మార్చుకునే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: