తమిళనాడులో రాజకీయ వేడి రోజురోజుకీ పెరిగిపోతుంది. తాజాగా, హీరో విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత ఆయన్ను తమ కూటమిలో చేర్చుకునేందుకు అనేక రాజకీయ పార్టీలు వ్యూహాలు రూపొందిస్తున్నాయి. కరూర్ ఘటన తర్వాత విజయ్ మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు మద్దతుగా నిలవాలన్న ఉద్దేశంతో కొన్ని పార్టీలు మెల్లగా చర్చలు ప్రారంభించాయి.


విజయ్ ఇప్పటికే తన పార్టీకి ప్రజాదరణ సంపాదించుకున్నారు. అయితే రాజకీయంగా ఒక్కస్థిరంగా నిలవాలంటే పక్కా వ్యూహం అవసరం. డీఎంకేకు ప్రత్యామ్నాయం కావాలనుకునే విజయ్, కాంగ్రెస్ కూటమిలో చేరే అవకాశం లేదు. ఎందుకంటే, కాంగ్రెస్ ఇప్పటికీ డీఎంకేకి నిబద్ధతగా ఉంది. మరోవైపు, బీజేపీతో విజయ్‌కు భావజాల పరమైన భేదాభిప్రాయాలు ఉన్నాయని ఆయన స్వయంగా ప్రకటించారు. అంటే, బీజేపీతో పొత్తు సాధ్యం కాదు అన్నమాట.



అయితే విజయ్ మొదటి నుంచే అన్నాడీఎంకేతో పొత్తుకు అనుకూలంగా ఉన్నారు. కానీ సమస్య ఏంటంటే.. అన్నాడీఎంకే ఇప్పటికే బీజేపీతో కలిసిపోయింది. అయితే ఇప్పుడు మరోసారి అన్నాడీఎంకే, విజయ్ పార్టీతో టచ్‌లోకి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. బీజేపీ లేకుండా కలిసి పోటీ చేద్దామని విజయ్ సంకేతాలు ఇచ్చారని రాజకీయ వర్గాల్లో చర్చ.



అన్నాడీఎంకే నేతలు మాత్రం బీజేపీతో ఉన్నా.. అది కేవలం కేంద్రం మద్దతు కోసమేనని, తమ స్థానిక రాజకీయాలకు సంబంధం లేదని విజయ్‌ను బుజ్జగిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ మైనర్ భాగస్వామిగా మాత్రమే ఉందని నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కరూర్ ఘటన సమయంలో బీజేపీ నాయకులు, ముఖ్యంగా అన్నామలై, ఖుష్బూలు విజయ్‌కు మద్దతుగా నిలవడం ఆయన మనసును మార్చేలా చేసింది.



ప్రశాంత్ కిషోర్ వంటి రాజకీయ వ్యూహకర్తలు ఇప్పటికే విజయ్‌ను ఒంటరిగా పోటీ చేయవద్దని హెచ్చరించారు. రెండు పెద్ద కూటములు, అదనంగా విజయ్ పార్టీ కూడా ఒంటరిగా పోటీ చేస్తే.. ఓట్ల చీలికతో చివరకు డీఎంకేకు భారీ లాభం జరుగుతుంది. ఈ పాయింట్‌ను బలంగా సూచించిన ప్రశాంత్ కిషోర్‌తో విజయ్ విభేదించడంతో, ఆయన టీమ్ వెనక్కి తగ్గింది.


ఇప్పుడు పరిస్థితి ఇలా ఉంది – విజయ్ కు అన్నాడీఎంకేతో పొత్తు తప్పనిసరిగా కనిపిస్తోంది. అయితే అది బీజేపీని దూరం పెడుతూ జరిగితేనే విజయ్ శిబిరం ఒప్పుకుంటుంది. కానీ బీజేపీని వదిలేసేంత సాహసం అన్నాడీఎంకే చేస్తుందా? లేదా చివరకు విజయ్ స్వయంగా తన భావజాలం కాస్త మార్చుకుని ఎన్డీఏ కూటమిలోకి అడుగుపెడతారా? అన్నది చూడాల్సిందే. తమిళ రాజకీయాల్లో విజయ్ ఏ నిర్ణయం తీసుకున్నా అది రేపటి సమీకరణాలను పూర్తిగా మార్చేయగలదు.

మరింత సమాచారం తెలుసుకోండి: