వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఈ సంవత్సరం దీపావళిని బెంగళూరులోని తన నివాసంలో సతీమణి వై.ఎస్. భారతితో కలిసి ఘనంగా జరుపుకున్నారు. టపాసులు కాల్చుతూ కుటుంబ సమేతంగా సంబరాలు జరుపుకున్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి. దీపావళి పండుగను జరుపుకోవడం తప్పు కాదు గానీ, ప్రస్తుతం పార్టీ ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఇంత పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించాల్సిన అవసరముందా అనే చర్చ వైసీపీ వర్గాల్లోనే మొదలైంది. గత సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. ఆ సమయంలో పార్టీకి ఊహించని విధంగా అనేక సీనియర్ నేతలు ఓడిపోవడంతో జగన్ కుటుంబం దీపావళిని జరుపుకోలేదు. ఆ ఓటమి ప్రభావం ఇప్పటికీ పార్టీలో కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో ఈసారి బెంగళూరులో దీపావళి సంబరాలు జరపడం కొంతమందికి నచ్చలేదు. 


ముఖ్యంగా రాష్ట్రంలో వైసీపీ అనేక సమస్యలను ఎదుర్కొంటున్న వేళ, ఈ వేడుకలు సమయోచితం కాదని సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం వైసీపీకి కీలక నేతలు కొందరు వివిధ కేసుల్లో జైల్లో ఉన్నారు. ముఖ్యంగా అక్రమ మద్యం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి నేతలు ఇంకా బెయిల్ పొందలేదు. మరోవైపు పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి పెరుగుతోంది. జిల్లాల స్థాయిలో నాయకులు చురుకుగా వ్యవహరించడం లేదని, కొందరు ప్రత్యర్థి కూటమి నాయకులతో సహకరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లలో కూడా విభేదాలు బయటపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ అధినేత విదేశీ తరహాలో పండుగ జరుపుకోవడం సరైన సంకేతం కాదని కొందరు అనుకుంటున్నారు. 


అనంతపురానికి చెందిన ఓ మాజీ ఎంపీ ఆఫ్‌ద్ రికార్డ్‌గా మాట్లాడుతూ, “జగన్ పండుగ చేసుకోవాలనుకుంటే తాడేపల్లి నివాసంలోనే పార్టీ నాయకులతో కలిసి జరుపుకుంటే బాగుండేది” అని వ్యాఖ్యానించారు. తాము ఈసారి కూడా దీపావళిని జరుపుకోలేదని, పార్టీపై ఇంకా ప్రజల్లో సానుభూతి రాలేదని అన్నారు.మొత్తానికి, దీపావళి వేడుకలతో జగన్ కుటుంబం సంతోషంగా గడిపినా, ఆ సంబరాలు పార్టీ అంతర్గతంగా అసంతృప్తి రగల్చినట్లు కనిపిస్తోంది. ఈ వ్యవహారం వైసీపీ నాయకత్వానికి కొత్త తలనొప్పిగా మారిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: