అర‌బ్ దేశాల ప‌ర్య‌ట‌న ముగించుకుని వ‌చ్చిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఓ వార్తా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీపై మరోసారి ప్ర‌శంస‌ల జల్లు కురిపించారు. జాతీయ రాజ‌కీయాలపై స్పష్టతనిస్తూ, దేశానికి మోడీ నాయకత్వం ఎంత అవ‌స‌ర‌మో విశ్లేషించారు. మోడీ నాయ‌క‌త్వంపై బాబు చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌తిప‌క్ష 'ఇండీయా' కూట‌మికి గ‌ట్టి సందేశాన్ని పంపిన‌ట్లుగా విశ్లేష‌కులు భావిస్తున్నారు. కరెక్ట్ టైంలో కరెక్ట్ లీడ‌ర్: చంద్రబాబు మాట‌ల్లో మోడీ నాయ‌కత్వం గురించి అనేక కీలక అంశాలు ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చాయి: అత్యంత శ‌క్తివంత‌మైన నాయ‌క‌త్వం: "ఈ దేశానికి సరైన సమయంలో సరైన నాయకుడు నరేంద్ర మోడీ" అని బాబు కొనియాడారు. మోడీది అత్యంత శక్తివంతమైన నాయకత్వం అన్నారు.
 

దశాబ్దం మోడీదే: గ‌త 11 ఏళ్లుగా మోడీ దేశాన్ని పాలిస్తున్నారని, రానున్న దశాబ్దం కూడా కచ్చితంగా మోడీదే అవుతుందని ఆయ‌న ధీమా వ్యక్తంచేశారు. ప్ర‌గ‌తి శీల ప్ర‌భుత్వం: కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రగతి శీల ప్రభుత్వమని, ప్రపంచంలో భారత్ ని నిలబెట్టడానికి మోడీ చేస్తున్న కృషి అద్భుతమని కితాబిచ్చారు. మోడీ హయాంలోనే దేశంలో సంస్కరణలు పెద్ద ఎత్తున సాగుతున్నాయని పేర్కొన్నారు. ఇండీయా కూటమికి బాబు ఫుల్ క్లారిటీ: ఇటీవల బీహార్ ఎన్నికలను ముడిపెడుతూ కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఇబ్బందుల్లో పడుతుందని ఇండీయా కూటమి నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు చంద్ర‌బాబు తనదైన శైలిలో బ్రేక్ వేశారు. 2029 దాకా ఆయ‌నే: "నరేంద్ర మోడీ 2029 దాకా మరో నాలుగేళ్ల పాటు దేశానికి ప్రధానిగా విశేష సేవలు అందిస్తారు" అని బాబు స్ప‌ష్టం చేశారు. ఈ విధంగా చెప్పడం ద్వారా, మధ్యలో మోడీ ప్రభుత్వం కూలిపోతుందనే భ్రమలు పెట్టుకోవద్దని ఇండీయా కూట‌మికి గ‌ట్టి మేసేజ్ ఇచ్చారు.

 

బీహార్‌లో విజ‌యం ఖాయం: ఒక రాష్ట్రంలో ఎన్నికల ఫలితం కేంద్ర ప్రభుత్వ భవిష్యత్తును తేల్చదని చెబుతూనే, బీహార్‌లో కూడా ఎన్డీయే ఘన విజయం సాధిస్తుందని బాబు జోస్యం చెప్పారు. టీడీపీ ఫుల్ స‌పోర్ట్‌: ఎన్డీయేలో టీడీపీ, జేడీయూ మద్దతు కీలకమని, అందులోనూ టీడీపీకే ఎక్కువ మంది ఎంపీల మద్దతు ఉందని, మోడీ నాయ‌కత్వంపై త‌మ మ‌ద్ద‌తు విషయంలో ఎలాంటి సందేహాలు అవ‌స‌రం లేద‌ని తేల్చి చెప్పారు. ఏపీలో అభివృద్ధి: డబుల్ ఇంజ‌న్ స‌ర్కార్: ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడటం వ‌ల్ల గడచిన పదహారు నెలల్లో విశేషమైన అభివృద్ధి జరుగుతోందని చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం పుంజుకోవ‌డం, వ్యవసాయంలో ప్రగతి, టెక్నాలజీని అందిపుచ్చుకోవ‌డం, కొత్త పరిశ్రమలు, పెట్టుబడులు పెద్ద ఎత్తున ఏపీకి రావ‌డం తమ ప్రభుత్వం సాధించిన విజయాలని ఆయ‌న వివరించారు. రాష్ట్రానికి కేంద్ర సహకారం ఉంటే ప్రగతి దారులు కచ్చితంగా కనిపిస్తాయని అన్నారు. బాబు వ్యాఖ్య‌లు జాతీయ స్థాయిలో ఎన్డీయేకు, రాష్ట్ర స్థాయిలో త‌న ప్ర‌భుత్వానికి స్థిర‌త్వం ఉన్నాయ‌ని చాటిచెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: