ఉద్యోగులకు సింహస్వప్నంలా కనిపించిన 'పని రాక్షసుడు' చంద్రబాబు నాయుడు పూర్తిగా మారిపోయారు! ఒకప్పుడు రోజుకు 18 గంటలు పనిచేసి, తనతో పాటు చుట్టుపక్కల అధికారులను కూడా నిద్ర పోనివ్వని సీఎం ఇప్పుడు 'స్మార్ట్ వర్క్'కు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. ఉదయం 10-11 గంటల మధ్య సచివాలయానికి వచ్చి, సాయంత్రం 6 గంటలకల్లా ఇంటికి చేరుకుంటున్నారు. దీంతో సచివాలయ ఉద్యోగులు ఊపిరి పీల్చుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు. అయితే, ఈ మార్పు కేవలం పనివేళలకే పరిమితం కాలేదు. అత్యవసరాలు, విపత్తుల నిర్వహణలో ఆయన వైఖరి పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది.
 

గతంలో, అధికారుల సూచనలు పక్కన పెట్టి, స్వయంగా క్షేత్రస్థాయి పర్యటనలకు ప్రాధాన్యమిచ్చే చంద్రబాబు, ఇప్పుడు ఆ పద్ధతికి వీలైనంత దూరంగా ఉంటున్నారు. దీనికి తాజా ఉదాహరణ 'మొంథా తుఫాను' నిర్వహణ. సచివాలయం నుంచే సమర్థవంతమైన పర్యవేక్షణ .. మొంథా తుఫాను విషయంలో సీఎం చంద్రబాబు స్మార్టుగా పనిచేసి గొప్ప ఫలితాన్ని సాధించారని చెబుతున్నారు. సోమ, మంగళవారాల్లో ఆయన సచివాలయం నుంచే తుఫాను పరిస్థితులపై పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించారు. తాను కంగారు పడకుండా, అధికారులను హడలెత్తించకుండా చాలా ప్రశాంతంగా దిశానిర్దేశం చేయడం వల్ల మంచి ఫలితం వచ్చిందని విశ్లేషకులు అంటున్నారు.



తుఫాను తీవ్రతపై సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన సీఎం, ప్రభుత్వంలో అన్ని శాఖలు, అన్ని జిల్లాల అధికారులను అప్రమత్తం చేశారు. జిల్లాల్లో కంట్రోల్ రూములు, ప్రత్యేక అధికారుల నియామకం, మంత్రులను జిల్లాలకు పంపడం వంటి చర్యలు తీసుకున్నారు. అయితే, ఆయన కేవలం అధికారులు, మంత్రుల సమాచారానికే పరిమితం కాలేదు. రాష్ట్రంలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆర్టీజీఎస్ (RTGS) కేంద్రానికి అనుసంధానించి, అక్కడి నుంచే ఏం జరుగుతుందో ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఈ అత్యాధునిక సాంకేతిక వినియోగం వల్ల సేవల్లో ఎక్కడా లోపం లేకుండా అధికారులు పనిచేయక తప్పలేదు.



ముందస్తు అంచనా, మెరుపు వేగంతో పునరుద్ధరణ .. తుఫాను తరువాత కరెంటు సరఫరాకు ఆటంకం ఏర్పడడం సహజం. దీన్ని ముందే పసిగట్టిన సీఎం, ఏ ప్రాంతంలో విద్యుత్ అంతరాయం ఉంటుందనే విషయాన్ని కచ్చితంగా అంచనా వేశారు. ప్రత్యేక బృందాలను ముందుగానే సిద్ధం చేసి, తుఫాను ప్రభావం తగ్గిన వెంటనే కరెంటు సరఫరాను పునరుద్ధరించేలా చర్యలు తీసుకున్నారు. నిజానికి, విపత్తుల నిర్వహణలో చంద్రబాబుకు ప్రత్యేక మేనేజ్‌మెంట్ స్కిల్ ఉంటుందని చెబుతారు. గతంలో తీవ్రంగా కష్టపడి ఇతరులను కూడా కష్టపెట్టిన ఆయన, ఈసారి మాత్రం చాలా స్మార్ట్‌గా, టెక్నాలజీని అస్త్రంగా వాడుతూ అద్భుతమైన ఫలితం సాధించి ప్రశంసలు అందుకున్నారు. ఈ నూతన శైలి నాయకత్వం మరింత మెరుగైన ఫలితాలను ఇస్తుందని ఆశిద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: