తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ వివాదాల గాలులు వీచుతున్నాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి సర్కారులో మంత్రుల మధ్య అంతర్గత గిల్లికజ్జాలు చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ లాంటి మంత్రుల చుట్టూ వివాదాల మబ్బులు కమ్ముకున్న వేళ.. ఇప్పుడు సినీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు కూడా హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి… సినిమా రంగానికి సంబంధించిన అనేక కార్యక్రమాలు, నిర్ణయాలను పర్యవేక్షించాల్సి ఉంటుంది. కానీ ఇటీవల కాలంలో ఆయన ప్రాముఖ్యత తగ్గిపోయిందనే భావన పార్టీ వర్గాల్లో ఉంది.
 

ముఖ్యంగా ఆయన ప్రమేయం లేకుండా సినిమా టికెట్ల ధరల పెంపు, సినీ సంఘాల కార్యక్రమాలు వంటి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారన్న అనుమానం వ్యక్తమవుతోంది. మంగళవారం జరిగిన సినీ ఆర్టిస్టు సంఘాల అభినందన సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కానీ అదే శాఖకు చెందిన మంత్రి కోమటిరెడ్డికి ఆహ్వానం అందకపోవడం ఆయన అనుచరులను ఆగ్రహానికి గురి చేసింది. ఈ సంఘటనతో మంత్రి తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. అంతేకాదు, టికెట్ల ధరల పెంపులో 20 శాతం భాగాన్ని సినీ కార్మికులకు కేటాయించాలన్న ప్రతిపాదన కూడా తన దృష్టిలో లేదని ఆయన వాపోయారట.ఇంతకు ముందు కూడా కోమటిరెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేసి వివాదానికి కారణమయ్యారు.

 

ఇక‌ “ఇంత జరిగిందా, అంత జరిగిందా, నాకేం తెలుసు.. ఏదైనా ఉంటే వారినే అడగండి” అంటూ ఓ కీలక సినిమా అంశంపై ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద చర్చకు దారితీశాయి. ఇప్పుడు మరోసారి ఆయన పేరే మళ్లీ హాట్ టాపిక్ అవుతోంది. కాంగ్రెస్ హైకమాండ్‌కు ఈ పరిణామం అసలు ఊహించని విషయం. ఇప్పటికే మంత్రుల మధ్య సైలెంట్ వార్ కొనసాగుతుండగా, కోమటిరెడ్డి అలకతో పరిస్థితి మరింత క్లిష్టం అవుతుందన్న విశ్లేషణ వినిపిస్తోంది. పార్టీ అంతర్గత విభేదాలు బయటపడితే, రాబోయే ghmc ఎన్నికల్లో కాంగ్రెస్ ఇమేజ్‌పై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ సర్కారులో అంతర్గత విభేదాలు గరిష్ట స్థాయికి చేరాయా? కోమటిరెడ్డి నిజంగా అలిగారా? లేక ఇది రాజకీయ వ్యూహమేనా? అన్నదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: