తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసు మరోసారి రాజకీయంగా హీటెక్కుతోంది. ఇప్పటి వరకు ఈ కేసు వ్యాపారస్తులు, సరఫరాదారులకే పరిమితమై ఉంటే, ఇప్పుడు రాజకీయ సంబంధాల వైపు సిట్ దృష్టి మళ్లడం పెద్ద చర్చగా మారింది. తాజా పరిణామాల్లో టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు కడూరు చిన్న అప్పన్నను సిట్ అరెస్ట్ చేయడంతో ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. ఇప్పటి వరకు ఈ కేసులో సిట్ 15 మందిని అరెస్టు చేసింది. కానీ అప్పన్న అరెస్ట్ తర్వాత సంఖ్య 16కు చేరింది. ఈ ఒక్క అరెస్టుతోనే సిట్ దర్యాప్తు రాజకీయ దిశలోకి మలుపు తిరిగిందనే సంకేతాలు వస్తున్నాయి. నిందితుడు చిన్న అప్పన్న స్వస్థలం విజయనగరం జిల్లా తెర్లాం మండలం పాములవలస.
 

ఇక ఆయన గత కొన్నేళ్లుగా వైవీ సుబ్బారెడ్డి వద్ద పర్సనల్ అసిస్టెంట్‌గా పని చేస్తూ హైదరాబాదులో ఆయన వ్యక్తిగత, వ్యాపార వ్యవహారాలను చూసేవాడని పోలీసులు చెబుతున్నారు. చిన్న అప్పన్న కల్తీ నెయ్యి సరఫరాదారులతో నేరుగా లింక్ ఉన్నట్లు సిట్ ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయనను జూన్ నెలలోనే సిట్ విచారించినప్పటికీ, ఆ సమయంలో దర్యాప్తు నిలిచిపోయింది. కారణం - వైవీ సుబ్బారెడ్డి హైకోర్టును ఆశ్రయించి, సిట్ అదనపు ఎస్పీ వెంకట్రావు దర్యాప్తును ప్రశ్నించడంతో కోర్టు స్టే విధించింది. ఆ మూడు నెలల గ్యాప్ తర్వాత ఇప్పుడు సుప్రీం కోర్టు ఆదేశాలతో దర్యాప్తు మళ్లీ వేగం పుంజుకుంది. అదే సమయంలో అప్పన్న అరెస్ట్ కావడం యాదృచ్ఛికం కాదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సిట్ దర్యాప్తు అధికారులు బుధవారం రాత్రి 8 గంటలకు అప్పన్నను అధికారికంగా అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు.



ఈ కేసులో ఆయనను ఏ-24 నిందితుడిగా గుర్తించారు. అంతేకాదు, ఆయన వద్ద నుంచి ముఖ్యమైన పత్రాలు, లావాదేవీల రికార్డులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. దీంతో సిట్ త్వరలోనే మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని కూడా విచారణకు పిలిచే అవకాశం ఉందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామంతో వైసీపీ శిబిరంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎందుకంటే టీటీడీ అనేది భావోద్వేగ అంశం. అలాంటి పవిత్ర సంస్థలో కల్తీ నెయ్యి సరఫరా కేసులో రాజకీయ నేతల పేర్లు వినిపించడం పార్టీకి పెద్ద ఇబ్బంది తెచ్చిపెట్టే అవకాశం ఉంది. సిట్ ఇప్పుడు “రాజకీయ ప్రమేయం కూడా ఉందా?” అన్న కోణంలో దర్యాప్తు జరుపుతోంది. మొత్తం మీద కల్తీ నెయ్యి కేసు చిన్న విషయం కాదు. ఈ కేసు దర్యాప్తు దిశ రాజకీయంగా మలుపు తిరిగితే, టీటీడీ నుండి హైదరాబాదు వరకు కలకలం రేపే పరిస్థితి తలెత్తవచ్చు. అప్పన్న అరెస్ట్ తర్వాత సుబ్బారెడ్డి పేరు సిట్ లిస్టులోకి వచ్చిందా? అన్నది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: