ఏపీ రాజకీయాల్లో టిడిపికి ఇప్పుడెక్కడికక్కడ సవాళ్లు పెరుగుతున్నా కూడా, రెండు కీలకమైన ఎస్సీ నియోజకవర్గాల్లో మాత్రం పార్టీకి తీవ్ర ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇవి పదేపదే వివాదాల్లో చిక్కుకోవడం, నాయకుల వైఖరి, అంతర్గత విభేదాలు బహిర్గతం కావడం వల్ల పార్టీ ఆధిపత్యం దెబ్బతింటున్నాయి. సత్యవేడు, తిరువూరు ఈ రెండు నియోజకవర్గాల పరిస్థితి టిడిపి అధిష్టానం ముందు పెద్ద తలనొప్పిగా మారింది. అందుకే వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితిని సమూలంగా మార్చేలా వ్యూహం సిద్ధం చేస్తున్నారు. అవసరమైతే ప్రస్తుత ఎమ్మెల్యేల స్థానంలో కొత్త నాయకులను ముందుకు తెచ్చే అవకాశాలూ పార్టీ వర్గాలు సూచిస్తున్నాయి.


సత్యవేడు నియోజకవర్గం :
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఈ నియోజకవర్గంలో టిడిపి గెలుపు భారీ చర్చకు దారి తీసింది. వైసీపీ నుంచి వచ్చిన కోనేటి ఆదిమూలంకు టికెట్ ఇవ్వడం ద్వారా టిడిపి ఆ సమయంలో ఈ సీటు ద‌క్కించుకుంది. అయితే పార్టీకి ఈ ఉత్సాహం ఎక్కువకాలం నిలవలేదు. మహిళా నాయకురాలని వేధించారన్న ఆరోపణలతో ఆదిమూలం కేసులో చిక్కుకోవడం, అనంతరం పార్టీ నుంచి సస్పెన్షన్ రావడం పరిస్థితిని తారుమారు చేసింది. కేసు తర్వాత వెనక్కి తీసుకున్నా ఆదిమూలం రాజకీయంగా పూర్తిగా యాక్టివ్ అవ్వలేకపోతున్నారు.


ఈ ఖాళీని భర్తీ చేస్తూ పార్టీ మరో వ్యాపారవేత్తను రంగంలోకి దించింది. కానీ ఇప్పుడు ఈ ఇద్దరి మధ్యే
పొలిటిక‌ల్ వార్ న‌డుస్తోంది. “ నా అనుమతి లేకుండా నియోజకవర్గంలో పర్యటన ఎలా ? ” అని ఆదిమూలం ప్రశ్నిస్తుంటే, పార్టీ నన్నే ముందుకు తెచ్చిందని, పూర్తి హక్కులతో పని చేస్తున్నానని వ్యాపారవేత్త స్పష్టం చేస్తున్నారు. ఈ అంతర్గత పోరు నియోజకవర్గంలో పార్టీ ఇమేజ్‌పై భారీ ప్రభావం చూపుతోంది.


తిరువూరు నియోజకవర్గం :
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఈ నియోజకవర్గంలో మొదటిసారి గెలిచిన కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారశైలి మొదటి రోజు నుంచీ వివాదాస్పదంగానే ఉంది. మాటలు, వ్యవహారం, నిర్ణయాలు అన్నీ పార్టీకి ఇబ్బందులు కలిగించేలా మారాయి. తాజాగా ఎంపీతో పెద్ద ఎత్తున రగడకు దిగడంతో పరిస్థితి మరింత దిగజారింది. స్థానికంగా నాయకులు ఒకే స్వరంతో కొలికపూడి కారణంగా పార్టీ నష్టపోతుందని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో సుమారు 12 మంది నాయకులు లిఖితపూర్వకంగా పార్టీ అధిష్టానానికి నివేదించినట్టు సమాచారం.


పార్టీ వ్యూహం :
ఈ రెండు నియోజకవర్గాల పరిస్థితిని నియంత్రించకపోతే వచ్చే ఎన్నికల్లో భారీ నష్టం తప్పదన్న భావన టిడిపి నాయకత్వంలో ఏర్పడింది. అందుకే సమన్వయం కోసం ప్రయత్నాలు ప్రారంభించడంతో పాటు, అవసరమైతే ఎమ్మెల్యేల స్థానంలో వేరే వారికి పూర్తి బాధ్య‌త‌లు సైతం అప్ప‌గించేందుకు పార్టీ సిద్ధంగానే ఉందని సమాచారం. ఎన్నికల నాటికి ఈ రెండు స్థానాల్లో పరిస్థితిని పునర్నిర్మించేందుకు వేరే ఆలోచ‌న‌లు అయితే చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: