ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, గిరిజన సంక్షేమం పట్ల ఆయన చూపిస్తున్న చొరవతో గిరిజన ప్రాంతాల్లో జనసేన ఓటు బ్యాంకు భారీగా పెరుగుతోంద‌న్న విశ్లేష‌ణలు ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో వ్య‌క్తం అవుతున్నాయి.  గత ఎన్నికల్లో గిరిజన ప్రాంతాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని ఆదరణ లభించింది. ఏజెన్సీ ప్రాంతాల్లోని మెజారిటీ ఓట్లు వైసీపీ ఖాతాలోకే వెళ్లాయి. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పవన్ కల్యాణ్ గిరిజన ప్రాంతాల రూపురేఖలు మార్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల వెనుకబడిన ఏజెన్సీ ప్రాంతాల్లో పవన్ చేపడుతున్న పనులు ఇప్పుడు వైసీపీ ఓటు బ్యాంకుకు గండి కొడుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.


మౌలిక సదుపాయాల కల్పన:
గిరిజనుల ప్రధాన సమస్య అయిన రవాణా సౌకర్యాలపై పవన్ ప్రత్యేక దృష్టి సారించారు. 'పల్లె పండుగ 2.0'లో భాగంగా గిరిజన ప్రాంతాల్లో దాదాపు 8,571 కిలోమీటర్ల మేర కొత్త రోడ్ల నిర్మాణానికి రూ. 5,838 కోట్లు కేటాయించారు. గిరిజన గ్రామాల ప్రజలు అనారోగ్యానికి గురైనప్పుడు డోలీల మీద ఆసుపత్రికి తరలించే 'డోలీ మోతల' కష్టాలకు చరమగీతం పాడాలనేది పవన్ ప్రధాన ఉద్దేశం. గిరిజన పల్లెలను ప్రధాన మార్గాలతో అనుసంధానించడం ద్వారా వైద్యం, విద్య పట్ల వారికి భరోసా కల్పిస్తున్నారు.


జీవనోపాధి మరియు అభివృద్ధి:
కేవలం రోడ్లు మాత్రమే కాకుండా, గిరిజన ఆర్థికాభివృద్ధికి కూడా పవన్ ప్రాధాన్యత ఇస్తున్నారు. రూ. 375 కోట్లతో 25 వేల మినీ గోకులాలు, రూ. 16 కోట్లతో 157 కమ్యూనిటీ గోకులాలు నిర్మిస్తున్నారు. పశుసంవర్ధక శాఖ ద్వారా గిరిజనులకు ఉపాధి కల్పించడంతో పాటు, నీటి నిర్వహణ కోసం మ్యాజిక్ డ్రైన్ల ఏర్పాటు వంటి వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. విశాఖపట్నంలో నిర్వహించిన 'పీఈఎస్ఏ (PESA) మహోత్సవ్' గ్రాండ్ సక్సెస్ కావడం పవన్ పనితీరుకు అద్దం పడుతోంది. 10 రాష్ట్రాల నుండి ప్రతినిధులు హాజరైన ఈ వేడుకను పవన్ వ్యక్తిగతంగా పర్యవేక్షించారు. మరో ఆసక్తికర అంశం ఏమిటంటే, తన కుమారుడు అకిరా నందన్ సింగపూర్‌లో గాయపడిన సమయంలో కూడా, ముందుగా నిర్ణయించిన గిరిజన అభివృద్ధి కార్యక్రమాన్ని పూర్తి చేసిన తర్వాతే పవన్ సింగపూర్ వెళ్లారు. గిరిజనుల పట్ల ఆయనకున్న ఈ అంకితభావం ప్రజల్లో బలమైన ముద్ర వేసింది.


రాజకీయ లబ్ధి కోసం కాకుండా, నిజాయితీగా గిరిజనుల సమస్యలను పరిష్కరిస్తున్న పవన్ తీరుపై ఏజెన్సీ ప్రజల్లో నమ్మకం పెరుగుతోంది. గతంలో వైసీపీ వైపు నిలబడ్డ గిరిజన ఓటు బ్యాంకు ఇప్పుడు జనసేన వైపు మళ్లుతోందని, రానున్న రోజుల్లో ఇది రాజకీయంగా పెద్ద మార్పులకు దారితీస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: