అధికారంలో ఉన్న కాంగ్రెసు నేతృత్వంలోని యూపిఏ ప్రభుత్వం వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తోందా? హిందూ ఓటర్లు ప్రధాన ప్రతిపక్షం బీజేపీ వైపు మరలుతుండటంతో ఆ పార్టీకి చెక్ చెప్పేందుకు ప్లాన్ గీస్తోందా? తాజా పరిణామాలు అలాగే కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్-మే నెలల్లో జరగాల్సిన లోక్సభ ఎన్నికలను ఆరు నెలల ముందే ఎదుర్కొనే సన్నాహాల్లో యూపిఏ ఉన్నట్టు ఢిల్లో జోరుగా ఊహగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల పార్లమెంట్ ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలు జోరందుకున్నాయి. మొన్న ములాయం, ఇప్పుడు వెంకయ్య నాయుడు. ఇలా ఒకరి తర్వాత మరొకరు బల్లగుద్ది మరీ ముందస్తు ఎన్నికలొస్తాయని ప్రకటిస్తున్నారు.
కాంగ్రెస్ ప్లాన్..
అయితే.. కాంగ్రెస్ మాత్రం 'ముందస్తు' వాదనను కొట్టిపారేస్తూనే తన వ్యూహాన్ని పక్కాగా అమలు చేస్తోంది. ముందస్తు ఎన్నికలొచ్చే ఛాన్సే లేదని అంటోంది. 2014 ఎన్నికలకు ఇంకా ఏడాది గడువుండగానే.. అందరినోట ముందస్తు ఎన్నికల మాట వినిపిస్తోంది. కాంగ్రెస్ కు నిన్నమొన్నటి దాకా మిత్రపక్షంగా ఉన్న సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్, ప్రతిపక్ష పార్టీ నేత వెంకయ్యనాయుడు ముందస్తు ఎన్నికలు తప్పవని నొక్కి వొక్కాణిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షం బీజేపి కూడా ముందస్తు ఎన్నికల అంశాన్ని లేవనెత్తింది. త్వరలో పార్లమెంట్ కు ఎన్నికలు వస్తాయన్న సంకేతాలు తమకున్నాయంటోంది. ఈ ఏడాదిలోనే లోక్సభ ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ యోచిస్తున్నట్లు బిజెపి అగ్ర నేత వెంకయ్యనాయుడు అంచనా వేస్తున్నారు
ములాయం ముందస్తు గంట..
వచ్చే సెప్టెంబర్ తర్వాత సార్వత్రిక ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయని సమాజ్ వాది పార్టీ నేత ములాయం బెదరగొడుతున్నారు. ముందస్తు నగారా మోగిస్తున్నారు. జాతీయ పార్టీలు సహా ప్రముఖ పాత్ర పోషించే అన్ని ప్రాంతీయ పార్టీలను తొందర పెడుతున్నారు. ములాయం వ్యాఖ్యలపై రాజకీయ విశ్లేషకులు సైతం దృష్టిసారించారు. సెప్టెంబర్ లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందనడంలో.. కాంగ్రెస్ పెద్దలే యుపిఏ సర్కార్ ను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళతారా.. లేక యుపిఏ కు సెప్టెంబర్ లోగా ములాయం తన 21మంది ఎంపీల మద్దతు ఉపసంహరించుకుంటారా అన్న అనుమానం వ్యక్తమౌతోంది.
ఎవరు ఎన్ని విధాలా ప్రయత్నించినా.. ముందస్తు ఎన్నికలు ఉండవంటోంది యుపిఏ సర్కార్. ఎన్డీఏ ఆరేళ్ల పాలనతో పోలీస్తే.. యుపిఏ ఎనిమిదేళ్ల పాలన పురోగతి సాధించిందని అంటోంది. దేశ భద్రత వ్యవహారంలో కఠినంగా వ్యవహరిస్తున్నామని కేంద్రమంత్రి మనీష్ తివారి తెలిపారు.
అంతా సిద్ధం..!
దాదాపు మూడు నెలల క్రితం అజ్మల్ కసబ్.. ఇప్పుడు అఫ్జల్ గురు ఉరి వ్యవహారం, నగదు బదిలీ పధకం లాంటివి ముందస్తు ఎన్నికల వ్యూహంలో భాగమేననే విశ్లేషణ చేస్తున్నారు. అధికార పక్షం లోపాయకారిగా ముందస్తుకు సిద్ధమవుతుండటంతో ప్రతిపక్షాలు కూడా ఇప్పటి నుంచే తమ పార్టీ శ్రేణులను సిద్ధం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. అటు ప్రతిపక్షాల నోట ముందస్తు మాటను అంత ఆషామాషీగా కొట్టిపారేయలేమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. యుపిఏ ముందస్తు లేదని చెబుతున్నా.. కలగూర గంపలా ఉన్న.. కూటమిలో భాగస్వామ్య పక్షాలను ఇప్పటి నుంచే ఒక్కతాటిపైకి తెచ్చేందుకు అధికార యూపీఏ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. గతంలో స్వయంగా ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ సైతం ముందస్తు ఎన్నికల సంకేతాలు ఇచ్చారు. ముందస్తు ఎన్నికలు లేవంటూనే కాంగ్రెసు ఆ దిశగా పావులు కదుపుతోందని అంటున్నారు. దాంతో ఏ క్షణమైనా ఎన్నికలు రావచ్చనే పార్టీలన్ని మానసికంగా సిద్ధమైపోతున్నాయి.
మరింత సమాచారం తెలుసుకోండి: