ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేసే కుట్రలు జరుగుతున్నాయని  ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆరోపించారు. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఇతరుల మనోభావాలను దెబ్బతీసేందుకు ప్రయత్నించిన  ఇతరులను నగర బహిష్కరణ శిక్ష ఎందుకు  విధించలేదని ఎస్సీ, ఎస్టీ పరిరక్షణ నేత , ఎమ్మార్పీఎస్  నేత మందకృష్ణ మాదిగ  ప్రశ్నించారు. కేవలం దళితుడు అయినందుకే కత్తి మహేష్ కు నగర బహిష్కరణ విధించారని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మండిపడ్డారు.

కత్తి మహేష్ విషయంలో తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి తీసుకున్న నిర్ణయం నగర బహిష్కరణలా లేదని, కుల బహిష్కరణలా ఉందని విమర్శించారు.   షీర్డీ సాయిబాబా భక్తులను కించపర్చేలా స్వామి పరిపూర్ణానంద మాట్లాడిన విషయాలను ఆయన ప్రస్తావించారు.   మరోవైపు  మథర్ థెరిస్సాను కూడ కించపర్చేలా స్వామి పరిపూర్ణానంద  ప్రకటనలు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అగ్రవర్ణాలకు చెందిన వారు చేసినప్పుడు మాత్రం చూసీ చూడనట్టు వదిలేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ నిత్యం ఇతరుల మనోభావాలను కించపరిచే వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారని... ఆయనపై నగర బహిష్కరణ ఎందుకు విధించలేదని ప్రశ్నించారు. రంగనాయకమ్మ రామాయణాన్ని విమర్శిస్తూ పుస్తకాలు రాసినవారిని ఎందుకు బహిష్కరించలేదని అన్నారు. దళితుడైనందునే  కత్తిమహేష్‌కు ఇవన్నీ వర్తించాయని మందకృష్ణ అభిప్రాయపడ్డారు.  ఇతరులకో న్యాయం, దళితులకు మరో న్యాయమా అని ఆయన ప్రశ్నించారు. దళితులు  ప్రజాస్వామ్య పద్దతిలో  నిరసన తెలిపినా నేరమే అవుతోందన్నారు.  కనీసం మాట్లాడినా కూడ  నేరంగా చూస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.  కత్తి మహేష్‌పై  విధించిన నగర బహిష్కరణను వెంటనే ఎత్తివేయాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: