రైతు రుణమాఫీ గురించి ప్రభుత్వంపై నమ్మకం ఉంచండి అని అంటున్నాడు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. ప్రభుత్వం రైతు రుణమాఫీని చేసి తీరుతుందని ఆయన అంటున్నాడు. ఈ విషయంలో ప్రజలు ఎలాంటి దిగులూ పెట్టుకోవాల్సిన పని లేదని... అసలు రైతులు తమ రుణాలను చెల్లించేసినా, తిరిగి ఆ డబ్బును ప్రభుత్వం వెనక్కు ఇప్పిస్తుందని ఆయన హామీ ఇస్తున్నాడు. రైతులంతా ఇప్పుడు రుణాలను చెల్లించేయాలని, ప్రభుత్వం ఆ డబ్బును మళ్లీ వెనక్కు ఇప్పిస్తుందని ఈయన సలహా కూడా ఇచ్చేశాడు! మరి రైతులు ఆ పని చేయగలారా? అనే సందేహం నెలకొంటోందిప్పుడు. రుణమాఫీ అంశం గురించి మంత్రిగారు మాట్లాడుతూ... రైతులు బ్యాంకులకు రుణాలు చెల్లించేయాలని, ప్రభుత్వం వాటిని మాఫీ చేస్తుందని ఆయన వ్యాఖ్యానించాడు. ఇక చెల్లించాకా మాఫీ ఏమిటి? అంటే... రైతులు చెల్లించిన డబ్బును వెనక్కు ఇప్పించి మాఫీ చేస్తారట! చెల్లించడం ఏమిటి? తిరిగి వెనక్కు ఇప్పించడం ఏమిటి? ఈ గందరగోళం ఎందుకు? అని మనల్నిమనమే ప్రశ్నించుకోవాల్సి వస్తోంది. రుణామాఫీ అనే వ్యవహారం గురించి మంత్రులు ఇలాంటి గందరగోళపు మాటలు ఎందుకు మాట్లాడతారో కూడా అర్థం కాదు. మరి మంత్రుల మాటల సంగతి అటుంచితే.. ఈ మాటలపై ప్రజలు ఏమనుకొంటున్నారు? రైతులు ఏమంటారు.. అనే విషయాన్ని గనుక పరిశీలించినట్టైతే... రైతులు బ్యాంకులతో సంబంధాలు తెంచేసుకొని చాలా కాలం అయ్యింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే.. రైతు రుణమాఫీ అనే హామీని వినప్పటి నుంచి రైతులు బ్యాంకుల ఛాయలకు వెళ్ళింది కూడా లేదు. ఇక రుణాలకు సంబంధించి వడ్డీలు చెల్లించాల్సిన పని కానీ, వాటిని రెన్యువల్ చేయాల్సిన అవసరం కానీ లేదని రైతులు ఎప్పుడో ఒక అభిప్రాయానికి వచ్చారు. అవి మాఫీ అయిపోతాయనే భావనకు వ చ్చారు. నెల నెలా టంచనుగా డబ్బులు కట్టేసే డ్వాక్రా మహిళలు కూడా బ్యాంకులకు రుణాలను చెల్లించడం ఎప్పుడో ఆపేశారు. మరి అలా మైండ్ లో ఫిక్స్ అయిన జనాలకు ఇప్పుడు మంత్రిగారి కొత్త ఉపదేశం చెవికెక్కే అవకాశాలు ఏమాత్రం లేవని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు!

మరింత సమాచారం తెలుసుకోండి: