ఏపీలో సార్వత్రిక ఎన్నికలవేళ విపక్షాలు తమదైన రీతిలో ప్రచార కార్యక్రమాల్లో బిజీ అయ్యాయి. ఈ నేపథ్యంలో సర్వేలకైతే లెక్కేలేదు. రోజుకి కొన్ని వేల సర్వేలు, లక్షల విశ్లేషణలు బయటకి వస్తున్నాయి. అవును, అధికార పార్టీ వైసీపీని ఓడించేందుకు ఒక్కటైన కూటమికి గాజుగ్లాసు గండం పొంచి ఉన్నదని కొందరు రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు. విషయం ఏమిటంటే ఎన్నికల సంఘం జనసేన పార్టీ గాజుగ్లాసు గుర్తుని చాలా చోట్ల స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించడమే అందుకు కారణం. ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా ఏర్పడ్డాయనే విషయం విదితమే.

ఇక జనసేనకు 21 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాలు కేటాయించిన సంగతి అందరికీ తెలిసినదే. ఎన్నికల సంఘం పార్టీ సింబల్‌ గాజు గ్లాస్‌ గుర్తు టీడీపీ, బీజేపీ అభ్యర్థులు ఉన్న దాదాపు 50 నుంచి 70 నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించింది. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి జనసేనకు గుర్తింపు లేకపోవడం వలన ఆ పార్టీ గుర్తు ఫ్రీ సింబల్‌ జాబితాలోకి వెళ్లడం జరిగింది. కావున స్వతంత్ర అభ్యర్థులు కోరితే వారికి ఆ సింబల్‌ను కేటాయించే అవకాశం లేకపోలేదు. దాంతోనే వివిధ పార్టీల నుంచి రెబల్‌ అభ్యర్థులుగా, స్వతంత్రులుగా పోటీ చేసిన వారు గాజు గ్లాసు గుర్తుకు ప్రాధాన్యం ఇవ్వడం జరిగిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. కావున స్వతంత్ర అభ్యర్థుల్లో మెజార్టీ గాజుగ్లాసు గుర్తును పొందడటంతో టీడీపీ, బీజేపీ అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

అక్కడే వచ్చింది అసలు చిక్కు... జనసేన అభ్యర్థి అనుకొని స్వతంత్ర అభ్యర్థికి ఓట్లు వేస్తే విజయ సమీకరణాలు తలకిందులు అవ్వక మానవు. దాంతోనే కూటమి నేతలు ఇపుడు టెన్షన్‌ పడుతున్నారు. ఇప్పటి వరకు ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు విజయవాడ పార్లమెంటుతోపాటు గాజువాక, విజయనగరం, భీమిలీ, మైదుకూరు, మదనపల్లి, జగ్గయ్యపేట, మచిలీపట్నం అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించినట్టు తెలుస్తోంది. అయితే దీనిపైన ఇంకా అధికారక ప్రకటన వెలువడాల్సి వుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: