
స్మిత్ మరియు లబూచెన్ లు క్రీజులో ఉండే సమయానికి ఆస్ట్రేలియా కేవలం రెండు పరుగులకే రెండు వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ పరిస్థితిలో అనుభవం ఉన్న ఈ ఇద్దరు ఆటగాళ్లు ఇండియా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ స్కోర్ బోర్డును ముందు నడిపించారు. వీరిద్దరి జోడీ ప్రమాదకరంగా మారుతున్న తరుణంలో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా ఒక టాప్ బంతిని సంధించి లబూచెన్ (49) ను స్టంప్ అవుట్ అయ్యేలా చేశాడు. ఆ తర్వాత బంతికే రెన్సా ను అవుట్ చేసి ఇండియాకు డబుల్ స్ట్రైక్ ఇచ్చాడు. స్మిత్ మరియు హాండ్స్ కాంబ్ లు ఇన్నింగ్స్ ను చక్కదిద్దే బాధ్యతను తీసుకున్నా మరోసారి వీరిద్దరి జోడీని విడదీసి ఆస్ట్రేలియాను దెబ్బమీద దెబ్బ తీశాడు జడేజా.
స్టీవ్ స్మిత్ 107 బంతులను ఎదుర్కొని 37 పరుగులు మాత్రమే చేసి జడేజా బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. ఇండియా బౌలర్లలో జడేజా మాత్రమే పిచ్ మీద టర్న్ ను చక్కగా ఉపయోగించుకుని వికెట్లను సాధిస్తున్నాడు. ఇక అక్షర్ పటేల్ 10 ఓవర్లు మరియు అశ్విన్ 10 ఓవర్లు వేసినా ప్రభావం చూపించలేకపోయారు. ప్రస్తుతం క్రీజులో క్యారీ మరియు హాండ్స్ కాంబ్ లు ఉన్నారు. ఇప్పటికే వీరిద్దరి మధ్య భాగస్వామ్యం 50 పరుగులు పూర్తి అయింది. వీరిద్దరినీ వీలైనంత త్వరగా అవుట్ చేసి ఆస్ట్రేలియాను 200 పరుగుల లోపే కట్టడి చెయ్యాలి. ఈ పిచ్ ఇండియా బాటర్లకు కూడా అనుకూలంగా ఉండకపోవచ్చు.