ఐపీఎల్ 2025 సీజన్ క్రికెట్ ప్రేమికులకు రసవత్తరంగా కొనసాగుతోంది. ఈసారి కూడా 10 ఫ్రాంచైజీలు తమ శక్తిమేర పోటీ పడుతూ అభిమానులను అలరిస్తున్నాయి. అయితే వర్షం, వాతావరణ మార్పుల వల్ల ఇప్పటికే కొన్ని మ్యాచ్‌లు రద్దు కావడం, ఓవర్లు కుదించాల్సిన పరిస్థితులు రావడం లాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్‌లు రద్దుకాకుండా చూసేందుకు bcci (భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు) కీలక నిర్ణయం తీసుకుంది.

ఇకపోతే, ఈ సీజన్‌లో బీసీసీఐ కొత్త నియమాన్ని ప్రవేశపెట్టింది. ఇంతకు ముందు మ్యాచ్ వాయిదా పడితే గరిష్టంగా 60 నిమిషాల వరకు మాత్రమే అదనపు సమయం ఇస్తారు. కానీ, ఇప్పుడు ఈ వ్యవధిని 120 నిమిషాలకు (2 గంటలు) పెంచారు. బీసీసీఐ ఫ్రాంచైజీలకు పంపిన తాజా నోటిఫికేషన్ ప్రకారం, ప్లేయింగ్ షరతుల్లో క్లాజ్ 13.7.3లో మార్పు చేశారు. దీని ప్రకారం రాత్రి 1:30 నిమిషాల లోపు మ్యాచ్ పూర్తవడానికి అవకాశం ఉంటే, మ్యాచ్ కొనసాగించవచ్చు. 1:30 తర్వాత కూడా ఆట జరగలేనప్పుడు మాత్రమే మ్యాచ్‌ను రద్దు చేస్తారు.

ఈ కొత్త నియమం మే 20 (మంగళవారం) నుండి అమల్లోకి వచ్చింది. మిగిలిన లీగ్ మ్యాచ్‌లన్నీ ఈ నూతన గడువులో జరుగుతాయి. ఇప్పటివరకు ఈ సీజన్‌లో వర్షం కారణంగా మూడు మ్యాచ్‌లు రద్దు, మరో రెండు మ్యాచ్‌లలో ఓవర్లు కుదింపు జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో లీగ్ దశలో మ్యాచ్‌లు రద్దు కాకుండా ఉండేందుకు బీసీసీఐ ఈ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. గత ఐపీఎల్ సీజన్ల మాదిరిగా ప్లే ఆఫ్స్ కోసం ఇప్పటికే రెండు గంటల అదనపు సమయం ఇచ్చే నియమం యధావిధిగా కొనసాగుతుంది. ఈ రూల్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు.

ఇక వర్షం, వాతావరణ ప్రతికూలతల నేపథ్యంలో బీసీసీఐ వేదిక మార్పులు కూడా చేస్తున్నది. అందులో భాగంగా మే 23న జరగాల్సిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్‌ను బెంగళూరు నుంచి లక్నోలోని భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి స్టేడియంకి మార్చారు. బీసీసీఐ అధికార ప్రకటన ప్రకారం, బెంగళూరులో వాతావరణం అనుకూలంగా లేకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ సీజన్‌లో మే 25న మధ్యాహ్నం జరిగే గుజరాత్ టైటాన్స్ - చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ తప్ప మిగతా ఎనిమిది లీగ్ మ్యాచ్‌లు సాయంత్రం 8 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ కొత్త నిబంధన ప్రకారం ఇవన్నీ రాత్రి 1:30 నిమిషాల లోపు పూర్తయ్యేలా చూడనున్నారు.

మొత్తంగా ఐపీఎల్ 2025లో వర్షం కారణంగా మ్యాచ్‌లు రద్దు కాకుండా చూసేందుకు బీసీసీఐ మ్యాచ్ గడువును రెండు గంటలు పొడిగించి చర్యలు తీసుకుంది. ఇది అభిమానులకు మిగిలిన మ్యాచ్‌లను పూర్తి స్థాయిలో ఆస్వాదించే అవకాశం కల్పించనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: