ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇసుక స‌ర‌ఫ‌రా కాంట్రాక్టు ద‌క్కించుకున్న జేపీ కంపెనీ ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. కొద్దిరోజుల క్రిత‌మే రాజ‌ధాని ప‌రిధిలో ఒక వివాదానికి కార‌ణ‌మైన ఆ కంపెనీ ప్ర‌తినిధుల వ్య‌వ‌హార‌శైలి ఇప్ప‌టికీ మార‌లేదు. తాజాగా గుంటూరు జిల్లాలో మ‌రోసారి వారి శైలి చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వేమూరు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని కొల్లూరు మండ‌లం దోనేపూడి జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల మైదానంలో ఇసుక‌ను డంపింగ్ చేయ‌డానికి ఉప‌యోగించుకుంటున్నారు. దీనికోసం పొక్లెయిన‌ర్ తెచ్చి పాఠ‌శాల ప్ర‌హ‌రీగోడ ప‌డ‌గొట్ట‌డానికి ప్ర‌య‌త్నించారు. దీన్ని గ‌మ‌నించిన గ్రామంలోని యువ‌కులు, పాఠ‌శాల విద్యార్థులు అడ్డుకున్నారు. ఈ విష‌య‌మై అధికారుల‌కు ఫిర్యాదు చేసినా ఎవ‌రూ స్పందించ‌లేదు. దీంతో గ్రామ‌స్తులే జేపీ కంపెనీకి అడ్డుగా నిలిచారు. మ‌రోసారి పాఠ‌శాల ప్ర‌హ‌రీ ప‌డ‌గొట్ట‌డానికి వ‌స్తే వాహ‌నాల‌ను స్వాధీనం చేసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. గ్రామంలోకి రావొద్ద‌ని అల్టిమేటం జారీచేశారు. ఈ విషయాన్ని ప్ర‌భుత్వ పెద్ద‌ల‌వ‌ద్ద‌కు తీసుకువెళ్తామ‌ని జేపీ కంపెనీ ప్ర‌తినిధులు కూడా వారిని హెచ్చ‌రించారు. ఉద్రిక్త వాతావ‌ర‌ణం నేప‌థ్యంలో ఇరువ‌ర్గాలవారికి పోలీసులు స‌ర్దిచెప్ప‌డంతో వివాదం స‌ద్దుమ‌ణిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: