
'ఎం.ఎస్.సుబ్బులక్ష్మి లేదా ఎం.ఎస్.గా పేరుగాంచిన మదురై షణ్ముఖవడివు సుబ్బులక్ష్మి (1916 సెప్టెంబర్ 16 – 2004 డిసెంబర్ 11) కర్ణాటక సంగీత విద్వాంసురాలు, గాయని , నటి. ఈమె భారతదేశ అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్న పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి సంగీత కళాకారిణి, ఆసియా నోబెల్ ప్రైజ్‌గా పరిగణించే రామన్ మెగసెసే పురస్కారం పొందిన తొలి భారతీయ సంగీత కళాకారిణి. 1974 లో రామన్ మెగసెసె పురస్కారం పొందినప్పుడు అవార్డు ప్రదాతలు ప్రకటిస్తూ కర్ణాటక సంగీత శ్రోతల్లో తీవ్రమైన స్వచ్ఛతావాదులు శ్రీమతి. ఎం. ఎస్. సుబ్బులక్ష్మిని కర్ణాటక సంగీతపు శాస్త్రీయ, అర్థ-శాస్త్రీయ గీతాలాపనలో ప్రస్తుతపు ప్రధాన విశేషంగా పరిగణిస్తారు అని వ్యాఖ్యానించారు.
తమిళనాడు రాష్ట్రంలోని మదురైలో న్యాయవాది సుబ్రహ్మణ్య అయ్యర్, వీణావాద్య విద్యాంసురాలు షణ్ముఖవడివు అమ్మాళ్ కు 1916 సెప్టెంబర్ 16 న జన్మించింది. చిన్నప్పుడు ఆమెను ముద్దుగా కుంజమ్మ అని పిలిచేవారు. తల్లి ఆమె ఆది గురువు. పదేళ్ళ ప్రాయం నుంచే సంగీత ప్రస్థానం ప్రారంభమైంది. 1926 లో 10 సంవత్సరాల వయసులో గుడిలో పాటలు పాడడంతో తన తొలి సంగీత ప్రదర్శన మొదలైంది. నాటి నుండి సంగీత ప్రియులను తన మధుర స్వరంతో సంగీతంలో ఓలలాడిస్తూనే ఉంది. అప్పుడే తను మొట్టమొదటిసారిగా హెచ్.ఎం.వి కోసం ఆల్బమ్ అందించింది.తన జీవితకాలంలో సంగీత ప్రపంచంలో బహుశా ఎవరూ సాధించని, ఛేదించని రికార్డులు, రివార్డులు ఆమె అందుకుంది. ఆమె ఎక్కని 'శిఖరం లేదు, పొందని బహుమానం లేదు. అత్యంత ప్రతిష్ఠాత్మక పురస్కారాలు ఎన్నో సుబ్బులక్ష్మి గాత్రానికి దాసోహమంటూ ఆమె ముందు వాలాయి.ఇంటింటా పవిత్ర సుమసుగంధాలను వెదజల్లిన ' సుప్రభాత ' గీతమై ప్రతి ఇంటా ఆధ్యాత్మిక భావనలను విరజిమ్మిన విష్ణు సహస్రనామ నిత్యస్తోత్రమై ఈ ధరణీతలాన్ని కొన్ని దశాబ్దాల పాటు పులకింపచేసిన కర్ణాటక శాస్త్రీయ సంగీత స్వరధార 2004, డిసెంబర్ 11న శాశ్వతంగా మూగబోయింది.